ఏఐపై ఎలన్ మస్క్ భయం గొలిపే అంచనా ఇదీ..
"రేపు నా ఉద్యోగం ఉంటుందో లేదో.. నా కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో.." అనే భయం ప్రతి సామాన్యుడి గుండెల్లో రోజూ ఒక అలజడి సృష్టిస్తోంది.
"రేపు నా ఉద్యోగం ఉంటుందో లేదో.. నా కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో.." అనే భయం ప్రతి సామాన్యుడి గుండెల్లో రోజూ ఒక అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ విపరీతంగా ఎదుగుతున్న ఏఐ సాంకేతికతను చూసి ప్రపంచమంతా దిగులు పడుతున్న వేళ ఒక కొత్త ఆశల వెలుగు రేఖ కనిపిస్తోంది. ఇది కేవలం ఉద్యోగాలు పోయే కథ కాదు.. యంత్రాల నీడలో నలిగిపోతున్న మనిషి.. అపరిమితమైన సంపదను.. అందరికీ అందే ఆయురారోగ్యాలను పొంది స్వేచ్ఛగా జీవించబోయే ఒక నవయుగ ఉదయంగా చెప్పొచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరు వినగానే చాలామందిలో మొదటగా కలిగే ఆందోళన "మా ఉద్యోగం ఉంటుందా?" అనే ప్రశ్నే కలవరపెడుతోంది. కానీ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అంచనాల ప్రకారం ఏఐ మానవాళిని భయపెట్టే సాధనం కాదు.. సంపూర్ణ సుభిక్షం వైపు నడిపించే ఒక దివ్య దీపం.. మనం ‘కొరత’ ఉన్న ప్రపంచం నుంచి ‘సమృద్ధి’ ఉన్న నవయుగంలోకి అడుగుపెడుతున్నాం.
ఉద్యోగాల మార్పు.. మనుషుల ప్రగతి
ఏఐ రాకతో కొన్ని సంప్రదాయ పనులు యంత్రాల పరమవుతున్న మాట వాస్తవమే. అయితే ఇది ఉద్యోగాలు ముగిసిపోవడం కాదు.. పని స్వరూపం రూపాంతరం చెందడం.. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయి. కానీ కంప్యూటర్లు కోట్లాది కొత్త అవకాశాలను సృష్టించాయి. ఏై కూడా సరికొత్త పరిశ్రమలకు.. సరికొత్త ఉపాధి మార్గాలకు బాటలు వేస్తోంది. మనుషులు కేవలం కష్టపడి పనిచేసే స్థాయి నుంచి.. నూతన ఆవిష్కరణలను నడిపించే నాయకులుగా ఎదిగే అవకాశం దక్కింది.
‘యూనివర్సల్ హై ఇన్‌కమ్’ దిశగా అడుగులు
సాధారణంగా సాంకేతికత పెరిగేకొద్దీ ఉత్పత్తి వ్యయం తగ్గి.. వస్తువులు.. సేవల లభ్యత పెరుగుతుంది. మస్క్ భావన ప్రకారం.. ఏఐ , రోబోటిక్స్ ద్వారా సృష్టించబడే అపారమైన సంపద, భవిష్యత్తులో ప్రజలకు కేవలం ప్రాథమిక ఆదాయాన్ని అందించడమే కాకుండా ‘అధిక ఆదాయాన్ని’ అందించే స్థాయికి చేరుకుంటుంది. భవిష్యత్తులో "ఉద్యోగం దొరుకుతుందా?" అనే ఆందోళన కంటే "ఉత్పత్తి అయిన సంపదను సమాజానికి ఎలా ఉపయోగించాలి?" అనే ఆశాజనక చర్చలే ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.
అందరికీ శ్రేష్ఠమైన వైద్యం.. ఒక వైద్య విప్లవం
వైద్య రంగంలో ఏఐ తీసుకురానున్న మార్పులు మానవాళికి అద్భుతమైన వరం. నేడు ప్రపంచంలో అత్యంత సంపన్నులకు మాత్రమే లభించే అత్యుత్తమ వైద్యం, ఏఐ ఆధారిత డయాగ్నసిస్, రోబోటిక్ సర్జరీల పుణ్యమా అని భవిష్యత్తులో సామాన్యుడికి కూడా సులువుగా అందుబాటులోకి రానుంది. కోట్లాది మంది ఆరోగ్య సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించి.. సరైన చికిత్సను తక్కువ ఖర్చుతో అందించడం ద్వారా ప్రాణాపాయాలను నివారించవచ్చు.
సవాలును అవకాశంగా మలుచుకుందాం
ఏ గొప్ప మార్పైనా తొలినాళ్లలో సవాళ్లను విసురుతుంది. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం.. సాంకేతికతను మానవ శ్రేయస్సుకు సరిగ్గా వాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఏఐ అనేది మనిషి స్థానాన్ని ఆక్రమించే శక్తి కాదు.. మనిషి సామర్థ్యాన్ని.. జీవన ప్రమాణాలను అనంతంగా పెంచే అద్భుత సాధనం. భయాన్ని వీడి.. మార్పును ఆహ్వానిస్తే సాంకేతికత అందించే సమృద్ధి భవిష్యత్తు మనదే..