ఈసీ వివాదంలో టీడీపీ స్టాండ్ ఇదే.. మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్నికల కమిషన్ వివాదంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ తొలిసారి స్పందించారు.

Update: 2026-09-30 12:46 GMT

జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్నికల కమిషన్ వివాదంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేశ్ తొలిసారి స్పందించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై జాతీయ స్థాయిలో ఆందోళనలు చేయగా, ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశాయని అంటున్నారు. ఈ విషయంలో ఈసీ నిజాయితీని నిరూపించుకోవాలని టీడీపీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొన్న మంత్రి లోకేశ్ ఈ వివాదంపై ఎదురైన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారని అంటున్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, కమిషన్‌‌లోని ఇతర సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతంగా ఉండాల్సిన స్వయంప్రతిపత్త సంస్థలోనూ పారదర్శకత కొరవడిందంటూ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున దుమారం రేపుతున్నాయి. ఈ తరుణంలో ఎన్డీయే కూటమిలోని టీడీపీ, ఎల్జేపీ (LJP) వంటి మిత్రపక్షాలు ఈ వివాదాన్ని ఎలా చూస్తున్నాయనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

విమర్శలను తోసిపుచ్చిన లోకేశ్

ఈ వివాదంపై జాతీయ మీడియా వేదికగా స్పందించిన నారా లోకేశ్.. ప్రతిపక్షాల వాదనలను గట్టిగా తిప్పకొట్టారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిసారీ నిందలను ఈసీపై, వ్యవస్థలపై నెట్టడం ప్రతిపక్షాలకు ఒక అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా ఈసీ పక్షపాత వైఖరిపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ... ఒకవేళ ఈవీఎంలు అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తే, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది? అని లోకేశ్ సూటిగా ప్రశ్నించారు. దీనివల్ల ఈసీ తీరుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో హేతుబద్ధత లేదని ఆయన స్పష్టం చేశారు.

నిబంధనలపై స్పష్టత, వ్యవస్థలపై గౌరవం

గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియ మరియు 'ఎస్‌ఐఆర్' (SIR) విధానంపై కొన్ని సందేహాలు తలెత్తిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. అయితే, ఆ సందర్భంలో తాము కేవలం ఆరోపణలు చేయకుండా, నేరుగా ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నామని తెలిపారు. ఒక రాజకీయ పార్టీగా వ్యవస్థలను అకారణంగా విమర్శించడం కంటే, అనుమానాలు ఉన్నప్పుడు అధికారులను కలిసి వాస్తవాలు తెలుసుకోవడం బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాల సవరణ వంటి అంశాలపై పట్టుదలగా పనిచేయడమే అసలైన రాజకీయ పద్ధతి అని టీడీపీ నిరూపించిందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు, కమిషన్‌లోని అంతర్గత భిన్నాభిప్రాయాలపై జాతీయ రాజకీయాలు వేడెక్కిన వేళ ఎన్డీయే కూటమి తరఫున నారా లోకేశ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పకొడుతూ, ఎన్నికల సంఘంపై నమ్మకం ఉంచాలని ఇతర మిత్రపక్షాలకు లోకేశ్ ఇచ్చిన స్పష్టమైన సందేశం ఇచ్చారని అంటున్నారు. అంతేకాకుండా లోకేశ్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ఎన్డీయే మిత్రపక్షాల దృఢమైన వైఖరికి అద్దం పడుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News