విశాఖను ఎంచుకున్న నితిన్ నబీన్ !
బీజేపీకి జాతీయ అధ్యక్షుడు అయ్యాక నితిన్ నబీన్ ఏపీకి రావడం ఇదే తొలిసారి. అయితే ఆయన ఏపీ పర్యటనలో భాగంగా మొదటిగా అడుగుపెట్టే ప్రాంతంగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు.
బీజేపీకి జాతీయ అధ్యక్షుడు అయ్యాక నితిన్ నబీన్ ఏపీకి రావడం ఇదే తొలిసారి. అయితే ఆయన ఏపీ పర్యటనలో భాగంగా మొదటిగా అడుగుపెట్టే ప్రాంతంగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. ఆయన ఏపీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం లేదు, అయిదు రోజుల పాటు ఏపీలోనే ఉండబోతున్నారు. విశాఖనే కేంద్రంగా చేసుకుని ఆయన ఏపీ బీజేపీ బలోపేతానికి దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఇక చూస్తే ఇప్పటికే తెలంగాణాకు రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళిన నితిన్ నబీన్ ఏపీకి మొదటిసారి రావడం విశేషం. రాజకీయ కార్యక్షేత్రంగా విశాఖను ఎంపిక చేసుకోవడం మరో విశేషం.
భోగాపురం నుంచే నేరుగా :
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు తన ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసే ఈ నెల 17నే నితిన్ నబీన్ అదే ఎయిర్ పోర్టులో ఢిల్లీ నుంచి విమానంలో ల్యాండ్ అవుతున్నారు. అక్కడ నుంచి నేరుగా ఆయన విశాఖ చేరుకుంటారు. ఇక నితిన్ నబీన్ అయిదు రోజుల బిజీ షెడ్యూల్ కూడా పార్టీ ఖరారు చేసింది. ఆయన విశాఖలో పార్టీ సమావేశాలను నిర్వహిస్తారని అంటున్నారు. అలాగే 17 నుంచి 21 వరకూ ఏపీలో ఉంటారని తెలుస్తోంది. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్ కి బీజేపీ నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం పలుకుతారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏపీ మీద ఫోకస్ :
లోకల్ బాడీ ఎన్నికలు తొందరలో ఏపీలో నిర్వహించబోతున్నారు. బీజేపీకి అయిదు శాతం సీట్లు ఇస్తారని అంటున్నారు. అయితే తమ వాటా పెంచాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇదే సమయంలో ఏపీకి వస్తున్న నితిన్ నబీన్ దీని మీద పార్టీ రాష్ట్ర శాఖకు కూడా సూచనలు చేయవచ్చు అని అంటున్నారు. ఇక ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక ఏపీలో ఆయన ఎక్కడెక్కడ పర్యటిస్తారు అన్నది కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఏపీలో బీజేపీ ఎదుగుదల మీద నితిన్ నబీన్ ఫోకస్ పెట్టారని అంటున్నారు.
పార్టీకి బిగ్ టాస్క్ :
తెలంగాణాలో అధికారం దిశగా ఆశలు పెంచుకుంటున్న బీజేపీ ఏపీలో నిర్ణయాత్మకమైన శక్తిగా అవతరించాలని భావిస్తోంది. అయితే ఏపీలో బీజేపీ అంత యాక్టివ్ గా లేదని వార్తలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో యువకుడు అయిన బీజేపీ కొత్త అధ్యక్షుడు పార్టీ పటిష్టత గురించి క్యాడర్ కి లీడర్ కి చెప్పాల్సింది చెబుతారు అని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని పూర్తిగా బలోపేతం చేయడమే నితిన్ నబీన్ అజెండాగా ఉంది. తెలంగాణాలో ఇప్పటికే పార్టీ నేతలకు టాస్క్ ఇచ్చిన ఆయన ఏపీలో బీజేపీకి కూడా లక్ష్యాన్ని నిర్దేశించి వెళ్తారని అంటున్నారు.