అనాలని అన్నారా ...కేటీఆర్ కామెంట్స్ వైరల్ !

తెలంగాణాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దేశంలో మంచి విద్యా సంస్థలు లేకనే అనేక మంది విదేశాలకు వెళ్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.

Update: 2026-08-16 04:18 GMT

తెలంగాణాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దేశంలో మంచి విద్యా సంస్థలు లేకనే అనేక మంది విదేశాలకు వెళ్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఎనభయ్యేళ్ళ స్వాతంత్ర్యం తరువాత కూడా దేశంలో ఉన్నత స్థాయిలో విద్యా సంస్థలు సరైనవి లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అనివార్యమైన పరిస్థితులలో దేశీయంగా ఉండే విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కుమార్తె ప్రస్తావన తెస్తూ :

ఇదిలా ఉంటే తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో ఆయన తన కుమార్తె అమెరికాలో చదువుతున్న ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రపంచ స్థాయి వసతులతో కూడిన కాలేజీలు లేకపోవడం వలనే ఉన్నత విద్య కోసం విద్యార్థులు అమెరికా తదితర దేశాలకు వెళ్తున్నారని ఆయన అన్నారు. తన కూతురు కూడా విదేశాలలో చదువుకుంటానని చెప్పడం వెనక అదే ఉద్దేశ్యం ఉందని అన్నారు.

దేశంలోనే అత్యుత్తమ సంస్థలను ఏర్పాటు చేసి కేవలం విద్య మాత్రమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే విదేశాలకు వెళ్లే యువత సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఎంతసేపూ కులాలు మతాలు ఇతర అంశాల మీదనే చర్చ సాగుతోందని కానీ దేశానికి అవసరం అయిన విలువైన విద్య విషయంలో జరగాలని ఆయన కోరుకున్నారు. అంతే కాదు విద్యాభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు కావాలని అన్నారు.

భిన్నాభిప్రాయాలు :

అయితే కేటీఆర్ తాజాగా చేసిన ఈ కామెంట్స్ మీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి అన్నది కూడా ప్రశ్నిస్తున్నారు. పాలకులు రాజకీయ నేతలే కదా అని నిలదీస్తున్నారు. దేశంలో ప్రపంచ స్థాయి విద్యను అందించే ఐఐటీలు ఐఐఎంలు , ఐఐఎస్‌సీ వంటి ఎన్నో అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ చేసిన విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అని నెటిజన్లు మరి కొందరు అంటున్నారు. భారతీయ విద్యా వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కొందరు నెటిజన్లు అంటూంటే కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్ధులు సైతం విమర్శిస్తున్నారు. విద్యాపరంగా భారత్ ని చిన్నబుచ్చడం సరికాదని అంటున్నారు.

గ్లోబల్ ఎక్స్‌పోజర్ కోసమే :

కేటీఆర్ చెప్పే దాంట్లో ఆయన కోణంలో నిజం ఉందని అనుకున్నా అందరూ విదేశాలకు వెళ్ళి చదువుకోలేరు కదా అని అంటున్న వారూ ఉన్నారు. ఇక డబ్బున్న వారి బిడ్డలు రాజకీయ నేతల పిల్లలు సంపన్నుల వారసులు కేవలం గ్లోబల్ ఎక్స్‌పోజర్ కోసమే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు అన్న విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. దేశంలో నాణ్యమైన విద్యను అందించే ప్రతిష్టాత్మక సంస్థలు బలంగానే ఉన్నాయని విద్యా వేత్తలు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రపంచ విద్యా సంస్థలు భారత్ లో లేకపోవడం కారణం కాదని గ్లోబల్ కెరీర్ ఆశలతో భారీ ప్యాకేజీలు ఆధునిక సాంకేతిక పరిశోధనల కోసం విద్యార్థులు విదేశాలను ఎంచుకుంటున్నారని విద్యా రంగం నిపుణులు అంటున్నారు.

విదేశీ వర్శిటీల క్యాంపసులు :

ఇవన్నీ పక్కన పెడితే దేశంలో నాణ్యమైన సంస్థలుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఐఐటీలు, ఎన్‌ఐటీలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందాయని చెబుతున్నారు. గతంలో ఎలా ఉన్నా ఇటీవల కాలంలో దేశంలోనే విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని విద్యా వేత్తలు అంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారతదేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. మరి దీనిని బట్టి చూస్తే భారతీయ విద్యను తక్కువ చేయగలమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Tags:    

Similar News