గల్ఫ్ సస్పెన్స్ థ్రిల్లర్: ఇరాన్ ‘లెక్కలు’.. ఖతార్ ‘ట్రిక్కులు’.. ఇంతకీ ఆ ఇద్దరు పైలట్లు ఏమైనట్టు?

గల్ఫ్ రీజియన్‌లో శాంతి పవనాలు వీస్తున్నాయని అమాయకంగా అనుకునేలోపే.. ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాంక్ అయ్యే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కథాంశం తెరపైకి వచ్చింది.

Update: 2026-08-16 07:16 GMT

గల్ఫ్ రీజియన్‌లో శాంతి పవనాలు వీస్తున్నాయని అమాయకంగా అనుకునేలోపే.. ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాంక్ అయ్యే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కథాంశం తెరపైకి వచ్చింది. ఇరాన్-ఖతార్ ల నడుమ ఇప్పుడు నడుస్తున్నది మామూలు వివాదం కాదు.. యుద్ధ విమానాలు, మిస్సింగ్ పైలట్లు, రెడ్‌క్రాస్ సంస్థ.. పైగా అంతర్జాతీయ రాజకీయం..

కథలోకి వెళ్తే.. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ 'ఐఆర్ఎన్ఏ' పక్కా ప్లాన్‌తో ఒక కథనాన్ని వదిలింది. మార్చిలో ఖతార్ సైనిక స్థావరంపై దాడికి వెళ్లిన మూడు ఇరాన్ యుద్ధ విమానాలు కాస్తా దెబ్బతిన్నాయని, వాటిలోని ముగ్గురు పైలట్లు సురక్షితంగా పారాచూట్ల సాయంతో బయటకు దూకి ఖతార్ బలగాలకు 'గెస్ట్‌లు'గా చిక్కారని ఇరాన్ మిలిటరీ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేసింది. తమ పైలట్లను సురక్షితంగా రప్పించుకోవడానికి అంతర్జాతీయ రెడ్‌క్రాస్ తలుపులు కూడా తట్టేసింది.

తీరా సీన్ ఖతార్‌కి షిఫ్ట్ అయితే ఊహించని క్లైమాక్స్ మొదలైంది.. ‘ముగ్గురా? అబ్బే.. మా దగ్గర అంతమంది లేరండోయ్’ అంటూ ఖతార్ విదేశాంగ శాఖ సూటిగా బాంబు పేల్చింది. తమ గగనతలంలోకి వచ్చిన విమానాలను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పైలట్ల నుంచి రెస్పాన్స్ లేదని.. చివరికి తాము గాలించగా కేవలం ఒకే ఒక్క పైలట్ మృతదేహం మాత్రమే దొరికిందని స్పష్టం చేసింది. ‘పాపం ఆ మృతదేహాన్ని తీసుకెళ్లమని ఎంత పిలిచినా ఇరాన్ వైపు నుంచి స్పందనే లేదు’ అని ఇంకో మెలిక పెట్టింది.

ఇక్కడే అసలు కామెడీ.. సస్పెన్స్ మొదలయ్యాయి.. ఇరాన్ లెక్కల ప్రకారం ముగ్గురు పైలట్లు ఖతార్ రిసార్ట్‌లలో చిల్ అవుతున్నారు. ఖతార్ లెక్క ప్రకారం దొరికింది ఒక్కరే.. అదీ ప్రాణాలతో లేరు. మరి మిగిలిన ఇద్దరు పైలట్లు ఎక్కడికి మాయమైనట్టు? పారాచూట్ దారి తప్పి వేరే దేశంలో ల్యాండ్ అయ్యారా? లేక ఈ అంతర్జాతీయ పజిల్ వెనుక ఇంకేదైనా మిస్సింగ్ పీస్ ఉందా అనేది అసలైన మిలియన్ డాలర్ల ప్రశ్న.

అప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ పంచాయతీలతో గల్ఫ్ ప్రాంతం సెగలు కక్కుతోంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కన్నెర్ర చేయడం పాత కథే అయినా ఇప్పుడు ఖతార్ ఆకాశంలో పైలట్ల అదృశ్యం కొత్త రచ్చకు దారితీసింది. ‘ముగ్గురు’ అని ఇరాన్.. ‘ఒక్కడే’ అని ఖతార్ పొడుస్తున్న ఈ వింత పొడుపు కథకు క్లైమాక్స్ ఎప్పుడు పడుతుందో, ఆ మిస్సింగ్ పైలట్లు ఎప్పుడు బయటపడతారో అని గల్ఫ్ జనాలు పాప్‌కార్న్ తింటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News