ఒక్క కాల్‌తో 900 మందిని తీసేసిన 'జూమ్ రాజా'కే బోర్డు షాక్.. తన ఉద్యోగం కోసం ఇప్పుడు పోరాటం
"కర్మ అనేది ఒక సర్కిల్.. అది ఎప్పటికైనా తిరిగొస్తుంది" అనే నానుడి కార్పొరేట్ దిగ్గజాలకు కూడా వర్తిస్తుందని 'బెటర్ హోమ్ & ఫైనాన్స్' మాజీ సీఈఓ విషాల్ గార్గ్ మరోసారి నిరూపించారు.
"కర్మ అనేది ఒక సర్కిల్.. అది ఎప్పటికైనా తిరిగొస్తుంది" అనే నానుడి కార్పొరేట్ దిగ్గజాలకు కూడా వర్తిస్తుందని 'బెటర్ హోమ్ & ఫైనాన్స్' మాజీ సీఈఓ విషాల్ గార్గ్ మరోసారి నిరూపించారు. 2021లో క్రిస్మస్ పండుగ ముంగిట.. ఒక్కటంటే ఒక్క జూమ్ కాల్ పెట్టి ఏకంగా 900 మంది ఉద్యోగులకు ఒకే దెబ్బతో షాకిచ్చిన గార్గ్ గారికే.. ఇప్పుడు కంపెనీ బోర్డు మైండ్ బ్లాంక్ అయ్యేలా లే ఆఫ్ పింక్ స్లిప్ చేతికిచ్చింది. "అయ్యా.. నా ఉద్యోగం నాకివ్వండి" అంటూ ఆయన ఇప్పుడు లీగల్ నోటీసులతో పోరాటం మొదలుపెట్టడం కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త హాస్యానికి తెరలేపింది.
వారం ముచ్చట.. వేటు పడింది..
ఆగస్టు 3న బెటర్ హోమ్ & ఫైనాన్స్ బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గార్గ్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించి.. మాజీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించింది. అసలు విచిత్రం ఏంటంటే.. లూయిస్ కంపెనీ బోర్డులోకి అడుగుపెట్టిన ఒక్క వారంలోనే విషాల్ గార్గ్‌ను బయటకు సాగనంపడం.. ఇతరుల ఉద్యోగాలు క్షణాల్లో ఊడదీసిన గార్గ్‌కు.. తన కుర్చీ ఇంత వేగంగా ఖాళీ అవుతుందని ఊహించి ఉండరు.
'నా కుర్చీ నాదే.. లూయిస్ మోసం చేశాడు..
తనను పదవి నుంచి తీసివేయడాన్ని విషాల్ గార్గ్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్తగా వచ్చిన డేనియల్ లూయిస్ బోర్డు సభ్యులను తప్పుదోవ పట్టించి.. కుట్ర చేసి తనను బయటకు నెట్టేశారని ఆయన ఆరోపిస్తున్నారు. "దాదాపు పదేళ్లు రక్తం ఓడ్చి కంపెనీని నిర్మిస్తే.. నన్నే సీఈఓ పదవి నుంచి తీసేస్తారా? ఇది మహా అన్యాయం" అంటూ ఘోల్లుమంటున్నారు. తన సీఈఓ పదవిని తిరిగి ఇచ్చేయాలంటూ ఇప్పటికే ఒక భారీ న్యాయవాదిని పెట్టుకుని.. బోర్డుకు అధికారిక లీగల్ నోటీసులు కూడా పంపించారు.
అప్పట్లో జూమ్ రచ్చ.. ఇప్పుడు న్యాయపోరాటం..
2021లో 900 మంది ఉద్యోగులను తొలగిస్తూ "మీ అదృష్టం బాగోలేదు.. మీ ఉద్యోగాలు పోయాయి" అని ఫేస్-టు-ఫేస్ చెప్పకుండా జూమ్ కాల్‌లో ముగించినప్పుడు ఈయన చూపించిన 'ప్రొఫెషనలిజం' నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేసింది. నాటి విషాల్ గార్గ్ ప్రవర్తనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
కానీ కాలం ఎంత విచిత్రమైనదో చూడండి.. పదిమందికి జీవనాధారమైన ఉద్యోగాలు తీసేటప్పుడు 'కంపెనీ పురోగతి' అని కారణాలు చెప్పిన గార్గ్.. ఇప్పుడు తన సొంత కుర్చీపోయేసరికి "ఇది కంపెనీకి జరిగే పెద్ద నష్టం" అని లీగల్ పోరాటానికి దిగడం విశేషం. బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక లూయిస్ సారథ్యంలోనే కంపెనీ ముందుకెళ్తుందా అన్నది పక్కనబెడితే.. "క్రింద పడ్డా నాదే పైచేయి" అన్నట్లుగా గార్గ్ చేస్తున్న ఈ లీగల్ డ్రామా ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది..