సీజేపీ 2.0 ప్రారంభం.. ఒకే సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో యుద్ధం!

కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమాన్ని ప్రారంభించారు.

Update: 2026-08-16 07:00 GMT

కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం హింగోలిలోని సంత్రుక్ పింప్రిలో స్వయంగా పాఠశాలలను సందర్శించారు. బడులను బాగు చేయించాలనే ఉద్దేశంతో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ ఉద్యమం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. గతంలో విద్యార్థుల సమస్యలు, నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో లోపాలపై కేంద్ర ప్రభుత్వాన్ని హడలెత్తించేలా ఆందోళనలు నిర్వహించి విజయవంతమైంది. ఇక కాక్రోచ్ జనతా పార్టీ తాజాగా చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంత్రుక్ పింప్రిలో చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ (పాఠశాలలను బాగు చేసుకోండి) ఉద్యమం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ఎత్తిచూపుతూ, గ్రామీణ విద్యారంగ సమస్యలపై ఆయన చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మృగ్యంగా మారడంపై అభిజీత్ దీప్కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా ఆయన తన స్వగ్రామంలోని జెడ్పీ (జిల్లా పరిషత్) పాఠశాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.

పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు లేకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం, కిటికీలు పగిలిపోవడం వంటి సమస్యలను ఆయన బహిర్గతం చేశారు. ముఖ్యంగా, పగిలిన కిటికీలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చిత్రాలు ఉన్న బ్యానర్లు కట్టడం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోందని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్న తీరును ఆయన వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంటూ, "పిల్లలు ఇలాంటి వాతావరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తుండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, తక్షణమే ఫీజులపై సీలింగ్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లభ్యతపై 'చెక్-లిస్ట్' ఫారమ్ ద్వారా డేటాను సేకరించి, గ్రామస్థులు, తల్లిదండ్రులతో సోషల్ ఆడిట్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేయడం ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నారని, అందరికీ సమాన విద్య అందేలా ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోరారు.

మొదటి దశలో భాగంగా హింగోలిలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు. కేవలం విద్యారంగానికే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి అంటే నేలపై పడుకోబెట్టి చికిత్సం చేయడం, సర్జరీలకు దీర్ఘకాలం వేచి ఉండే సమయం, సీటీ స్కాన్ల జాప్యంపైనా ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

Tags:    

Similar News