చిలకలూరిపేట టీడీపీలో మర్రి తుఫాన్.. వైసీపీలో ఫుల్ జోష్

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక ఆ పార్టీలో పెను తుఫాన్ రేపింది. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రి రాజశేఖర్ సడన్ ఎంట్రీని ఆయన రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.;

Update: 2025-09-22 02:30 GMT

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక ఆ పార్టీలో పెను తుఫాన్ రేపింది. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రి రాజశేఖర్ సడన్ ఎంట్రీని ఆయన రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్సీ చేరికను నిరసిస్తూ రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు. మర్రి రాజశేఖర్ సొంత నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోనూ ఈ ముసలం కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో ఇన్నాళ్లు ఒక్కతాటిపై నడిచిన పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.

ఎమ్మెల్సీ మర్రి చేరికపై తమకు కనీస సమాచారం లేదన్న ఆగ్రహంతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. ఇలా రాజీనామా చేసిన వారిలో గుంటూరు జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఎం.ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్ ఉన్నారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రసాద్ ప్రకటించారు. అదేవిధంగా చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామాలు ప్రకటనలు చేశారు. వీరంతా ఎమ్మెల్యే ప్రత్తిపాటికి బాసటగా నిలుస్తున్నట్లు చెబుతున్నారు.

చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. అయితే 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో ఆయనకే టికెట్ అనుకున్నా, చివరి నిమిషంలో మహిళా నేత విడదల రజని చేరికతో రాజశేఖర్ ను తప్పించారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇవ్వడంతో అప్పట్లో మర్రి శాంతించారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసినా, మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో చిలకలూరిపేట నుంచి గెలిచిన విడదల రజినిని మంత్రిని చేశారు.

ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో మర్రికి వ్యతిరేకంగా రాజకీయాలు సాగాయని పరిశీలకులు చెబుతున్నారు. ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయులు వర్గంగా ముద్రపడటం వల్ల నియోజకవర్గంలో మర్రి మాట చెల్లుబాటు కానీయలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచుకున్న మర్రి.. గత ఎన్నికల ముందే పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అయితే వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడితో పార్టీలో కొనసాగారు. ఇక ఎన్నికల్లో ఓడిపోవడం, ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయులు టీడీపీ గూటికి చేరుకోవడం, చిలకలూరిపేట ఇన్ చార్జిగా మాజీ మంత్రి విడదల రజిని వైసీపీ తిరిగి నియమించడంతో ఎమ్మెల్సీ మర్రి ఆ పార్టీలో ఇమడలేక ఆరు నెలల క్రితమే రాజీనామా చేశారు.

వైసీపీని మర్రి వీడటంతో ఆ పార్టీలో గ్రూప్ వార్ కు పుల్ స్టాప్ పడింది. ఇక ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడ మంటలు చెలరేగుతున్నాయి. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్సీని నియోజకవర్గ నేతలకు చెప్పకుండా ఎలా పార్టీలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలలుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా, పార్టీ నుంచి తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే పుల్లారావు వర్గీయులు మనస్తాపం చెందినట్లు చెబుతున్నారు. దీంతో రెండు రోజులుగా చిలకలూరిపేట టీడీపీలో అలజడి కనిపిస్తోంది. అయితే జిల్లా, రాష్ట్రపార్టీ ఇంతవరకు ఈ విషయమై జోక్యం చేసుకోకపోవడం మరింత వేడిపుట్టిస్తోంది.

అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పుకోవడంతో చేసేదేమీ లేదని జిల్లా పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. కేడర్ ఆగ్రహం చల్లారిన తర్వాత ఈ విషయంపై మాట్లాడదామని వేచిచూస్తున్నట్లు చెబుతున్నారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా మర్రికి సూచనలుచేశారని, ఆయనకు వేరే ప్రత్యామ్నాయం చూపుతారని రాష్ట్ర పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. ఏదిఏమైనా తాజా రాజకీయ పరిణామాలు అధికార పక్షంలో కల్లోలం రేపగా, విపక్షం వైసీపీలో జోష్ తెప్పిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News