ఊహించని దెబ్బ! తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో 38 మంది మావోయిస్టులు హతం!
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు హతమయ్యారు.;
మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు హతమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ప్రకటించిన కొద్ది రోజులకే భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం సంచలనం రేపుతోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా దళాలు చేపట్టిన విస్తృత ఆపరేషన్‌లో ఏకంగా 38 మంది మావోయిస్టులు హతమయ్యారు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఐదు రోజులపాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్ మావోయిస్టులకు ఊహించని, కోలుకోలేని దెబ్బగా నిలిచింది.
గతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి కార్యకలాపాలు దాదాపుగా క్షీణించాయి. అయితే, ఒకప్పుడు తెలంగాణ నుంచి మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులైన అనేకమంది ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతాలకు తరలివెళ్లారు. అక్కడ భద్రంగా ఉండవచ్చనే ఉద్దేశంతో వారు ఆ ప్రాంతాన్ని తమ స్థావరంగా మార్చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఛత్తీస్‌గఢ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే దృఢ సంకల్పంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా చర్యలు ముమ్మరం చేసింది.
దీనిలో భాగంగానే గత ఐదు రోజులుగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించాయి. గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. మరోవైపు, మావోయిస్టులు కూంబింగ్ చర్యలను నిలిపివేయాలని, శాంతి చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదు. మావోయిస్టుల ఆనవాళ్లను గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.