మల్కాజ్ 'గిరి' .. క్రాస్ ఓటింగ్ కిరికిరి !

తాము ఓడినా ప్రత్యర్థులు గెలవకూడదు అన్న వార్తలు అభ్యర్థులలో దడపుట్టిస్తున్నది.

Update: 2024-05-17 07:40 GMT

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల ఫలితాలు రావడానికి మరో పక్షం రోజుల సమయం ఉండడంతో జూన్ 4న వచ్చే ఫలితాలలో గెలుపు ఎవరిది అని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ స్థానాల వారీగా వస్తున్న వివరాల ప్రకారం అభ్యర్థులు అందరికీ క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. తాము ఓడినా ప్రత్యర్థులు గెలవకూడదు అన్న వార్తలు అభ్యర్థులలో దడపుట్టిస్తున్నది.

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ తరపున ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ తరపున జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిలు బరిలోకి దిగారు. చేవెళ్ల తరపున పోటీకి దిగుతారు అనుకున్న సునీతను అనూహ్యంగా మల్కాజ్ గిరి నుండి పోటీకి దింపారు. దీంతో ఆమె స్థానికేతరురాలు అన్న ముద్రపడింది. ఇక మల్కాజ్ గిరి పరిధిలోని శామీర్ పేటలోనే నివాసం ఉంటున్నా ఈటెల రాజేందర్ కూడా స్థానికేతరుడు అనే వాదన వచ్చింది.

ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే స్థానికుడుగా చలామణి అయ్యాడు. అయితే హుజూరాబాద్ శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ఈటెల మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి గెలిస్తే భవిష్యత్ లో తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న భావనతో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేక బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది.

ఇక చేవెళ్ల లోక్ సభ పరిధిలో నుండి మల్కాజ్ గిరికి వచ్చిన సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకూ ఇబ్బంది అని కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ నేతలే మొకం చాటేసినట్లు తెలుస్తుంది. ఇది రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ప్రత్యేకదృష్టి పెట్టినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఓవరాల్ గా ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని అంటున్నారు. దేశంలోనే అతి పెద్ద ఓటర్లున్న మల్కాజ్ గిరిలో ఎవరు విజయం సాధిస్తారో ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News