మహాగఠ్ బంధన్ కొంప ముంచిన ఎం ఫ్యాక్టర్?

దీనికి తోడు తప్పుల మీద తప్పులు చేసిన ఈ కూటమి జరగాల్సిన శాస్తి జరిగిపోయింది. తమను అధికారంలోకి తీసుకొచ్చే ఎం ఫ్యాక్టర్ గురించి ఈ కూటమి నేతలు తరచూ మాట్లాడేవారు.;

Update: 2025-11-15 04:14 GMT

బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ కూటమి ఆశలు అన్ని ఇన్ని కావు. ఎన్నికల వేళలో తమకున్న శక్తియుక్తుల్ని వాస్తవ పద్దతిలో మదింపు చేసుకోవటం మానేసి.. లేని బలాన్ని ఊహించుకొని చతికిలపడింది మహాగఠ్ బంధన్ కూటమి. దీనికి తోడు తప్పుల మీద తప్పులు చేసిన ఈ కూటమి జరగాల్సిన శాస్తి జరిగిపోయింది. తమను అధికారంలోకి తీసుకొచ్చే ఎం ఫ్యాక్టర్ గురించి ఈ కూటమి నేతలు తరచూ మాట్లాడేవారు.

అయితే.. తాము నమ్ముకున్న ఎం ఫ్యాక్టర్ వర్కువుట్ అయ్యేలా వ్యవహరించారా? అంటే అదీ లేదని చెప్పాలి. ఇంతకూ ఈ ఎం ఫ్యాక్టర్ అంటే ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. మహిళలు.. ముస్లింలు.. మల్లాలు తమ వైపునకు తిప్పుకుంటే అధికారం ఇట్టే తమ చేతుల్లోకి వచ్చేస్తుందని ఆశించారు మహాగఠ్ బంధన్ కూటమి నేతలు.

నిజానికి వారి లెక్క కరెక్టే. ఎందుకంటే.. మొత్తం జనాభాలో ముస్లింలు 17.7 శాతం ఉండటం.. అందులో మహిళల వాటా ఏడు శాతాన్ని తీసేసినా.. పది శాతం.. యాభై శాతం వరకు ఉండే మహిళల్ని కలిపితే.. ఏకంగా 60 శాతం. వీరికి తోడుగా కూటమిలో ఉండే పార్టీలకు ఉండే సంప్రదాయ ఓటు బ్యాంకును కలుపుకుంటే గెలుపు నల్లేరు మీద నడకగా ఉండేది.

ఏసీ రూంలో కూర్చొని కాగితాల మీద లెక్కలు వేసుకున్నంత సింఫుల్ గా వాస్తవంలో ఓట్లు తమకు అనుకూలంగా మళ్లటం ఉండదన్న విషయాన్ని మహాగఠ్ బంధన్ మిస్ అయ్యింది. విపక్షంలో ఉన్న తాము అధికారంలోకి వస్తే మహిళలకు భారీ ఎత్తున మేలు చేకూరుస్తామంటూ ఇచ్చిన హామీలను మహిళలు నమ్మలేదు. ముస్లింలు మజ్లిస్ తో పాటు.. అధికార జనతాదళ్ (యూ)వైపునకు మళ్లటం.. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని భావించిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ అధిపతి ముఖేశ్ సహాని ఆసక్తి చూపకపోవటం ఒక దెబ్బ అయితే.. మైనార్టీల్లో అత్యధికంగా ఉండే ముస్లింలకు కాకుండా మల్లాలకు పదవిని ఇస్తామని చెప్పటం కోపం తెప్పించింది. మొత్తంగా మహాగఠ్ బంధన్ మునిగేలా చేసింది.

మరోవైపు పీకే పెట్టిన కొత్త పార్టీ కూడా మహాగఠ్ బంధన్ ను దెబ్బ తీశాయి. పీకే పెట్టిన జనసురాజ్ పార్టీ విపక్షాలు పోటీ చేసిన స్థానాల్లో మైనార్టీ ఓట్లను చీల్చింది. ఇలా ఎక్కడికక్కడ తప్పుల మీద తప్పులు జరిగి ఉండకపోతే ఇంత దారుణ పరాజయం ఎదురయ్యేది కాదు. విపక్షాల గెలుపులో కీలక భూమిక పోషిస్తాయని భావించిన మిథిలాంచల్, సీమాంచల్ లో వేసుకున్న లెక్కలు మొత్తం తప్పాయి. దీంతో.. మహాగఠ్ బంధన్ కు దారుణమైన పరాజయం దక్కింది.

Tags:    

Similar News