లండన్ నుంచి వచ్చి మరీ సూసైడ్.. కారణం ఇదే
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం లండన్‌లో స్థిరపడిన యువకుడు.. కుటుంబానికి గౌరవం, భవిష్యత్ పై స్పష్టమైన ప్రణాళిక అన్నీ ఉండి కూడా ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన కథ మన సమాజంలో భావోద్వేగాలకు ఉన్న విలువలను మరోసారి బయటపెడుతోంది.;
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం లండన్‌లో స్థిరపడిన యువకుడు.. కుటుంబానికి గౌరవం, భవిష్యత్ పై స్పష్టమైన ప్రణాళిక అన్నీ ఉండి కూడా ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన కథ మన సమాజంలో భావోద్వేగాలకు ఉన్న విలువలను మరోసారి బయటపెడుతోంది. ఉద్యోగం, విదేశీ జీవితం, స్థిరమైన భవిష్యత్తు అన్నీ కూడా ఆయన సూసైడ్ చేసుకోకుండా ఆపలేకపోయాయి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ మరణం కేవలం ఒక కుటుంబానికి జరిగిన విషాదం కాదు.. మన సామాజిక వ్యవస్థలోని లోపాలను నేరుగా చూపించే ఘటన.
శ్రీకాంత్ జీవితంలో ఎన్నో కలలు..
లండన్‌లో ఆరేళ్లుగా ప్రేమించిన యువతితో పెళ్లి చేసి స్థిరమైన కుటుంబ జీవితం మొదలుపెట్టాలని శ్రీకాంత్ కలలు కన్నాడు. ‘నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. స్వదేశానికి వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి’ సదరు యువతి చెప్పడంతో శ్రీకాంత్ ఐదు నెలల క్రితం భారత్‌కు రాగా, ఇదే అతని జీవితంలో కీలక మలుపైంది. యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడం అతన్ని తీవ్రంగా కుంగదీసింది. ఆ యువతికి ఈ నెల 7న మరొకరితో వివాహం జరుగుతుందనే వార్త అతని భావోద్వేగ స్థితిని పూర్తిగా కుదించింది. ప్రేమ విఫలమవడం అతనికి వ్యక్తి గత ఓటమిగా కాకుండా, జీవితమే నాశనం అయ్యిందనిపించింది.
6న సూసైడ్ కు యత్నం..
దీంతో ఆయన ఆత్మహత్య నిర్ణయానికి వచ్చాడు. ఈ నెల 6న పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించినా, 27న చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఒక విద్యావంతుడు, విదేశాల్లో ఉంటూ మంచి ఉద్యోగం చేసే యువకుడు అతనికి జీవితంలో నిలబడే శక్తి లేకపోవడం అతని వైఫల్యం కాదు. భావోద్వేగాలను అర్థం చేసుకోని సమాజం వైఫల్యం.
గ్రామంలో ఉద్రిక్తత..
అతని మరణం తరువాత గ్రామంలో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. 20 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆగ్రహంతో గ్రామస్థులు యువకుడి మృతదేహంతో పోలీస్ స్టేషన్‌ను ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. చివరకు శ్రీకాంత్ మృతదేహం ఉన్న ఫ్రీజర్ ను పోలీస్ వాహనంపై పెట్టి ధర్నా చేశారు.
ఈ ఘటనలో ప్రధాన ప్రశ్న ప్రేమ విఫలం కాదు.. భావోద్వేగాలకు మన సమాజం చూపుతున్న నిర్లక్ష్యం. మన విద్యా, మన కుటుంబాలు, మన పెద్దల ఆలోచన ఏ వ్యవస్త భావోద్వేగ బలం ఎలా పెంచుకోవాలో నేర్పదు. ఉద్యోగం ఎలా సంపాదించాలో నేర్పుతాం.. కానీ హృదయం విరిగినప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలో నేర్పం. బహుశా అందుకే చిన్న చిన్న మానసిక దెబ్బలు కూడా యువతకు భరించలేని బాధలుగా మారుతున్నాయి.
భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి..
డిప్రెషన్ ఒక వైద్య సమస్య. కానీ మనం దాన్ని బలహీనతగా చూస్తాం. సమాజం ‘ఎందుకు ఇంత భావోద్వేగం?’ అని ప్రశ్నిస్తుంది కానీ దానిలోని భారం ఎవరూ పట్టించుకోరు. ప్రేమ విఫలం అనేది జీవితం విఫలం కాదు. కానీ ఇది చెప్పే, అర్థం చేసుకునే వాతావరణం యువత చుట్టూ లేదు.
పోలీసుల స్పందన కూడా చాలా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రేమ వివాదం ఉన్న కుటుంబంపై దాడి ప్రయత్నం జరగబోతున్నా, ముందుగానే చర్యలు తీసుకోలేకపోవడం బాధాకరం. ఇలాంటి కేసుల్లో వ్యవస్థలు వేగంగా స్పందించకపోతే, బాధితుల కుటుంబాలు మరింత విరుచుకుపడుతాయి. శాంతి భద్రతలు కంటే, సమస్యలకు మూలమైన భావోద్వేగ సమస్యలను గుర్తించడం కూడా అవసరం. శ్రీకాంత్ మరణం మనకు ఏం చెప్తుందంటే.. మన సమాజం భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో బలహీనంగా ఉందని.
స్నేహితులు, కుటుంబం, ఉపాధ్యాయులు ఎవరైనా యువతతో మాట్లాడాలి, వారిని అర్థం చేసుకోవాలి. భావోద్వేగాల్లో ఎలా ఉండాలి.. ఎలా నియంత్రించుకోవాలో గైడెన్స్ ఇవ్వాలి.