మోడీ చేత పదే పదే అడిగించుకుంటున్న లోకేశ్

గత పర్యటనలో లోకేశ్ ను ఉద్దేశించి.. తనను కలిసేందుకు ఢిల్లీ రావాలని పిలవటం.. అందుకు లోకేశ్ తల ఆడించటమే తప్పించి.. ఢిల్లీ వెళ్లింది లేదు.;

Update: 2025-05-03 05:14 GMT

అత్యున్నత స్థాయిలో ఉన్న వారు పలుకరించటమే గొప్ప అనుకునే రోజుల్లో.. అందుకు భిన్నంగా పలుకరించటమే కాదు.. తనను కలిసేందుకు రావాలంటూ వ్యక్తిగతంగా ఆహ్వానం ఇచ్చినప్పటికి.. తన పరిధిని దాటేందుకు ఏ మాత్రం ఇష్టపడని వైనం ఏపీ మంత్రి నారా లోకేశ్ లో కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ సత్తా ఏమిటన్నది అందరికి తెలిసిందే. ఆయన నోటి నుంచి తమ పేరు వస్తే చాలు.. అదే పది వేలుగా ఫీలయ్యే నేతలు బోలెడెంత మంది ఉన్నారు ఈ రోజున. తాజాగా అమరావతి పున: ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. తనను కలిసిన నారా లోకేశ్ ను చూస్తూ.. భిన్నంగా రియాక్టు అయ్యారు.

గత పర్యటనలో లోకేశ్ ను ఉద్దేశించి.. తనను కలిసేందుకు ఢిల్లీ రావాలని పిలవటం.. అందుకు లోకేశ్ తల ఆడించటమే తప్పించి.. ఢిల్లీ వెళ్లింది లేదు. ప్రధాని మోడీని కలిసింది లేదు. అదే విషయాన్ని తాజాగా తన మాటలతో మోడీ చెప్పేశారు.‘నీకెన్నిసార్లు చెప్పాలి. నన్ను కలవటానికి రావా?’ అంటూ లోకేశ్ ను ఉద్దేశించి సూటిగా అడిగేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈసారి లోకేశ్ స్పందిస్తూ.. తాను త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వస్తానని.. మోడీని కలుస్తానని బదులిచ్చారు.

ఇంతకూ ప్రధాని మోడీ తనను కలిసేందుకు రావాలని లోకేశ్ ను పిలిచినా.. ఎందుకు వెళ్లనట్లు? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చగా మారింది. విపక్షంలో ఉన్న వేళలో.. చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించటం.. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసే ప్రయత్నం చేయగా.. ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదని చెబుతారు.

తాము గడ్డు పరిస్థితుల్లో ఉన్న వేళలో.. తన స్థాయి ఏమిటన్నది అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు తమ చేతలతో చెప్పకనే చెప్పేసి వైనాన్ని లోకేశ్ సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతారు. ఇదే ఆయనలో మరింత కసి పెంచేలా చేసిందని చెబుతారు. అందుకే.. అధికారపక్షంలోకి మారిన తర్వాత కూడా.. దాన్ని మనసులో నుంచి తీసేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే పిలిచినంతనే వెళ్లిపోవటం ద్వారా పలుచన అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వెళ్లలేదన్న మాట సన్నిహితుల నోట వినిపిస్తోంది. రెండోసారి గుర్తు పెట్టుకొని లోకేశ్ ను తనను కలిసేందుకు ఢిల్లీకి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో.. ఈసారి తప్పక వెళ్లే వీలుందని చెబుతున్నారు

Tags:    

Similar News