ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే ఒంటరి ప్రయాణం..!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేన పార్టీకి చెందిన లోకం నాగ మాధవి కొనసాగుతున్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేన పార్టీకి చెందిన లోకం నాగ మాధవి కొనసాగుతున్నారు. 2024 శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా ఆమె ఇక్కడి నుండి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు, పనితీరు వంటివాటిని పరిశీలిస్తే.. ఒంటరి ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి కూటమి నాయకులతో కలిసి చేయాల్సిన పనులను కూడా ఆమె ఒంటరిగానే చేస్తున్నారు.
మొత్తంగా అభివృద్ధి తాలూకు విజయాన్ని.. మార్కులను తనే సొంతం చేసుకునే వ్యూహంతో ఉన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే అన్ని రహదారులను వేగంగా అభివృద్ధి చేసేలా చేస్తున్నారు. దీని ద్వారా స్థానికంగా తన పేరు... హవాను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, జెన్‌జీని ఆకర్షించేలా ఉపాధి అవకాశాలు పెంచే విషయంపైనా దృష్టి పెట్టారు.
ఇక, ప్రజా సమస్యలపై స్పందన విషయానికి వస్తే.. నియోజకవర్గంలోని రహదారుల ఆక్రమణలు, మౌలిక వసతుల కొరతపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు సర్కారు నుంచి వివిధ రూపాల్లో నిధులు సమీకరిస్తున్నారు. భోగాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వంటి ప్రభుత్వ వైద్యశాలలను స్వయంగా సందర్శించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షలు నిర్వహిస్తున్నా రు. పార్టీలో ప్రాధాన్యత విషయానికి వస్తే.. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమెను పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రస్థాయి సంస్థాగత ఎన్నికల విధివిధానాల రూపకల్పన కమిటీలో సభ్యురాలిగా నియమించారు.
తన సొంత మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న లోకం మాధవి.. నెల్లిమర్ల ప్రాంత యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో స్థానికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారంపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కానీ.. ఎంతగా అభివృద్ధి చేసినా.. ఒంటరి ప్రయాణం మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. కూటమి నాయకులతోను.. ముఖ్యంగా జనసేన నేతలతోనూ ఆమె కలివిడిగా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.