బొబ్బిలి మళ్లీ రంగారావు దేనా... ?
విజయనగరం జిల్లాలోని అత్యంత కీలకమైన, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం బొబ్బిలి. రాజకీయంగా ఈ నియోజకవర్గం జిల్లాలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది.
విజయనగరం జిల్లాలోని అత్యంత కీలకమైన, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం బొబ్బిలి. రాజకీయంగా ఈ నియోజకవర్గం జిల్లాలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ కూటమి హవాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో కాలంగా బొబ్బిలి రాజవంశీయుల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు ( బేబినాయన ) మరింత పట్టు బిగించారు. అయితే.. మరోవైపు వైసీపీ కూడా ఇక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న తీరుతో ఆయన మరింత పనిచేయాల్సి వస్తోంది.
ప్రస్తుత ఎమ్మెల్యే రంగారావు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో బేబినాయనకు 1,12,366 ఓట్లు (సుమారు 60% ఓట్ల షేర్) రాగా, తన సమీప ప్రత్యర్థిపై 44,648 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో పరిశ్రమల స్థాపన, స్థానిక మౌలిక వసతులు మరియు సాగునీటి కాలువల ఆధునీకరణపై దృష్టి సారిస్తున్నారు.
2019 ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, 2024 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత తొలి ఏడాది శంబంగి మౌనంగా ఉన్నా.. గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను వైసీపీ అధిష్టానం విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బరిలోకి దించింది. కానీ, ఓటమి పాలయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
బొబ్బిలి రాజకీయాల్లో ప్రధాన సమీకరణల విషయానికి వస్తే.. రాజవంశీయుల ప్రభావం ఎక్కువగా ఉంది. వాస్తవానికి బొబ్బిలి నియోజకవర్గంలో మొదటి నుండి 'బొబ్బిలి రాజుల' ప్రభావం చాలా ఎక్కువ. ఇక్కడి ప్రజలు సాంప్రదాయకంగా రాజ కుటుంబీకులకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. బేబినాయన సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావు గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.
త్వరలోనే జరగనున్న స్థానిక ఎన్నికల్లో.. పంచాయతీ, మండలాధ్యక్ష వంటి నాలుగు మండలాల్లో (బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం) వైసీపీ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ ఇప్పుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది.
మొత్తం గా చూస్తే, బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ తన పట్టును బలపరుచుకుంటూ ముందుకు సాగుతుండగా, కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు వైసీపీ స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఇది సాధ్యమయ్యే పనికాదన్న చర్చ సాగుతోంది. ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా ఎమ్మెల్యే రంగారావు పనిచేస్తున్నారు. అందరినీ కలుపుకొని పోతున్నారు.