భ‌ర‌త్ ఆవేశం.. వైసీపీ ముందే చేతులు ఎత్తేస్తోందా..?

కుప్పం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జ్‌.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ భ‌ర‌త్ ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి తీవ్ర ఆవేశం ప్ర‌ద‌ర్శించిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

Update: 2026-09-12 11:30 GMT

కుప్పం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జ్‌.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ భ‌ర‌త్ ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి తీవ్ర ఆవేశం ప్ర‌ద‌ర్శించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. చంప‌డానికైనా.. చావ‌డానికైనా సిద్ధం కావాలి.. అంటూ పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌పై కేసులు కూడా పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదిలావుంటే.. భ‌ర‌త్ ఇంత ఆవేశ ప‌డడానికి కార‌ణం.. స్థానిక ఎన్నిక‌ల్లో త‌న హ‌వా కోసం పాకులాటే.

మ‌రి ఆ ర‌కంగా చూసుకుంటే.. భ‌ర‌త్ భ‌య్యా ఆవేశం ఏమేర‌కు ప‌నిచేస్తుంది? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ రాజకీయంగా వేడి పెంచుతు న్నారు. అయితే, వైసీపీ గెలుపు అవకాశాలను మాత్రం ఆయ‌న ప్ర‌భావితం చేయ‌లేక పోతున్నార‌న్న‌ది వాస్త‌వ‌మ‌ని అంటున్నారు నాయ‌కులు. అధికార పక్షానికే అనుకూల‌త‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతు న్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో ఉండటం వల్ల సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ.

మ‌రో వైపు కుప్పం మున్సిపాలిటీతో పాటు పలు మండలాల్లో గతంలో వైసీపీ తరపున గెలిచిన ప్రజాప్రతి నిధులు, ముఖ్య నాయకులను ఆ పార్టీకి దండం పెట్టేశారు. అనంత‌రం.. క్యూ క‌ట్టిన‌ట్టు టీడీపీలోకి చేరిపోయారు. ఇది భ‌ర‌త్ రాజ‌కీయాల‌కు.. ముఖ్యంగా వైసీపీకి పెద్ద మైనస్‌గా మారిపోయింది. కూటమి ప్రభుత్వం కుప్పంను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేడ‌ర్‌ను బ‌లోపేతం చేసింది. ఇది వైసీపీ శ్రేణుల దూకుడుకు బ్రేక్ వేసే అవకాశం ఉంది.

2021 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం కుప్పంలో వైసీపీకి గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల‌లో వైసీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా .. భ‌ర‌త్ కార‌ణంగా ఆ గ్రామాలు కూడా వైసీపీకి దూర‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని స్థానిక నాయ‌కులు చెబుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ-కూటమి స్పష్టమైన ఆధిక్యతతో బలంగా కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే భ‌ర‌త్‌.. చేతులు ఎత్తేసే ముందు.. గావు కేక‌లు పెట్టిన‌ట్టు కేడ‌ర్‌ను రెచ్చ‌గొడుతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. మొత్తంగా.. భ‌ర‌త్ భ‌య్యా ఆవేశ‌మే కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం పెద్ద‌గా దూకుడు లేకుండా పోయింద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News