తెలంగాణ‌ లో అన‌లాగ్ ప‌న్నీర్ పై నిషేధం.. ఎందుకు.. ఏంటా స్టోరీ?!

సాధార‌ణంగా.. రెస్టారెంట్ల‌లో ఎక్కువ మంది వినియోగదారులు తినేప‌దార్థాల జాబితాలో ప‌న్నీరుకు ఫ‌స్ట్ ప్లేస్ ఉంది.

Update: 2026-09-12 09:43 GMT

సాధార‌ణంగా.. రెస్టారెంట్ల‌లో ఎక్కువ మంది వినియోగదారులు తినేప‌దార్థాల జాబితాలో ప‌న్నీరుకు ఫ‌స్ట్ ప్లేస్ ఉంది. ప‌న్నీరుతో చేసిన కూర‌లకు మంచి గిరాకీకూడా ఉంటుంది. అయితే.. సాధార‌ణ ప‌న్నీరు స్థానంలో గ‌త కొన్నాళ్లుగా `అన‌లాగ్ ప‌న్నీరు` అనే కొత్త‌రకం ప‌న్నీరును రెస్టారెంట్ల‌లో వినియోగిస్తున్నారు. ఇది కూడా అచ్చం ప‌న్నీరు మాదిరిగానే ఉంటుంది. క్యూబులుగా ఉండే ప‌న్నీరుముక్క‌లు మంచి టేస్టు కూడా ఇస్తాయి. అయితే.. అస‌లు పన్నీరుకు.. అన‌లాగ్ ప‌న్నీరుకు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. దీంతో అస్సాం, పంజాబ్‌, యూపీ స‌హా.. అనేక రాష్ట్రాలు దీనిని నిషేధించాయి.

అస‌లు ప‌న్నీరు ఏంటి?

కూర‌ల‌కు మంచి టేస్టు ఇవ్వ‌డంతోపాటు.. రుచిక‌రంగా.. నోట్లో పెట్టుకుంటే క‌రిగిపోయేలా ఉండేది ప‌న్నీరు. దీనిని పాల‌తో త‌యారు చేస్తారు. పాల‌ను కాచిన త‌ర్వాత‌..దానిలో వెనిగ‌ర్ లేదా నిమ్మ‌రసం పోసి.. విరిగిపోయేలా చేస్తారు. అనంత‌రం.. దానిని వ‌డ‌గ‌ట్టి.. గ‌డ్డ‌గా త‌యారు చేస్తారు, దీనిని ముక్క‌లు ముక్క‌లుగా(క్యూబ్స్‌) కోసి కూర‌ల్లో వినియోగిస్తారు. పాలు ఎక్కువ‌గా తీసుకోని వారు.. పెరుగు అంటే ఇష్ట‌ప‌డని వారు.. పన్నీరుతో చేసిన కూర‌ల‌ను తీసుకుంటే.. పోష‌కాలు అందుతాయ‌ని వైద్యులు చెబుతుంటారు.

అన‌లాగ్ ప‌న్నీరు.. ఏంటి?

ప‌న్నీరుకు పెరిగిన డిమాండ్ కార‌ణంగా.. ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. అలాగ‌ని వినియోగ‌దారుల‌పై భారం మోపితే.. రెస్టారెట్ల కు గిరాకీ త‌గ్గుతోంది. దీంతో కృత్రిమంగా త‌యారు చేసే ప‌న్నీరును వినియోగిస్తున్నారు. దీనినే అన‌లాగ్ ప‌న్నీరు అంటారు. దీనిలో సీడ్ ఆయిల్‌, వెజిట‌బుల్ ఆయిల్స్‌, కొన్ని కెమిక‌ల్స్‌తోపాటు తెల్ల‌టి రంగు వ‌చ్చేలా మ‌రిన్ని ర‌సాయ‌నాల‌ను వినియోగిస్తారు. ఈ అన‌లాగ్ ప‌న్నీరులో ఎక్క‌డా చుక్క‌పాల‌ను వినియోగించ‌రు. అయిన‌ప్ప‌టికీ టేస్టు, చూసేందుకు కూడా అస‌లు ప‌న్నీరు మాదిరిగానే ఉంటుంది.

అన‌లాగ్ పన్నీర్‌తో దుష్ర్బ‌భావాలు

అన‌లాగ్ ప‌న్నీర్ తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్ర‌ధానంగా వీటిలో ఉండే అధిక శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. ఇది రక్తనాళాల్లో అడ్డంకులకు దారితీసి, భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. దీనిలో వాడే స్టార్చ్, సింథటిక్ పాలు, వివిధ రకాల కెమికల్స్ జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. అందుకే.. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా దీనిని నిషేధించింది. వాస్త‌వానికికేంద్ర ప్ర‌భుత్వం కూడా దీనిని నిషేధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే.. త‌యారీపై మాత్రం ఎలాంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News