గ్యాసిప్‌ కాదు నిజం: రాజీనామా చేసి వారం.. ఐఏఎస్‌కు బీజేపీ ఎంపీ టికెట్‌

కానీ,ఇటీవ‌ల కాలంలో ఎవ‌రూ దీనిని పెద్ద‌గా పాటించ‌డం లేదు. ఇలా రాజీనామా చేయ‌డంతో అలా ప‌ద‌వులు వారిని వ‌రిస్తున్నాయి.

Update: 2026-09-12 10:30 GMT

సాధార‌ణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకే చాలా మంది నాయ‌కులు పోటీప‌డుతున్న రోజుల్లో.. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల‌కు ఎంత డిమాండ్ ఉంటుంద‌న్నది అంద‌రికీ తెలిసిందే. ఇక‌, జాతీయ పార్టీలైన‌ కాంగ్రెస్‌, బీజేపీల‌లో లెక్క‌కు మిక్కిలిగా నాయ‌కులు టికెట్ల కోసం.. ప‌ద‌వుల కోసం రోడ్డెక్కిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. టికెట్ ద‌క్కితే.. చాలు! అనే నాయ‌కులు కూడా ఉన్నారు. అలాంటిది ఓ ఐఏఎస్ అధికారికి బీజేపీ టికెట్ కేటాయించ‌డం.. అది కూడా ఎంపీ టికెట్ కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం గా మారింది. స‌ద‌రు ఐఏఎస్ అధికారి.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ప‌ట్టుమ‌ని 8 రోజులు కూడా గ‌డ‌వ‌కుండానే క‌మ‌ల నాథులు అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఎవ‌రు ఎక్క‌డ‌?

ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని నాగావ్ జిల్లాలో క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ఐఏఎస్ అధికారి దేవాశిష్ శ‌ర్మ‌.. ఈ నెల 3న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే.. ఆవెంట‌నే ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పేసుకున్నారు. వాస్త‌వానికి అఖిల భార‌త స‌ర్వీసులో ఉన్న అధికారులు రిజైన్ చేసినా.. రిటైర్మెంటు అయినా.. రాజ‌కీయాలు చేసేందుకు క‌నీసం 3 మాసాల గ‌డువు ఉండాల‌న్న‌ది నిబంధ‌న‌(నియ‌మం కాదు). కానీ,ఇటీవ‌ల కాలంలో ఎవ‌రూ దీనిని పెద్ద‌గా పాటించ‌డం లేదు. ఇలా రాజీనామా చేయ‌డంతో అలా ప‌ద‌వులు వారిని వ‌రిస్తున్నాయి.

ఇలానే అస్సాంలో ఐఏఎస్ దేవాశిష్‌కు కూడా బీజేపీ కండువా క‌ప్పేసింది. స్థానిక నాగావ్ పార్ల‌మెంటు స్థానానికి తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వాస్త‌వానికి బీజేపీకి చాలా మంది నాయ‌కులు ఉన్నారు. పోటీకి కూడారెడీగా ఉన్నారు. అస్సాంలో బీజేపీవ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో కేడ‌ర్‌, నాయ‌కులు కూడా భారీ సంఖ్య‌లో పెరిగారు. అయిన‌ప్ప‌టికీ.. తాజా మాజీ ఐఏఎస్ దేవాశిష్ శ‌ర్మ‌కు ఈ టికెట్‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం. అక్టోబ‌రులో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌ఫున శ‌ర్మ పోటీ చేయ‌నున్నారు. విజ‌యం కూడా ఖాయ‌మ‌నే అంచ‌నాలు ఉన్నాయి.

ఉప ఎన్నిక ఎలా వ‌చ్చింది?

2024లో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నాగావ్ లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి.. ప్రద్యుత్ బోర్డోలోయ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఆయ‌న మ‌న‌సు మారింది. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల కు ముందు.. బోర్డోలోయ్‌.. క‌మ‌లం గూటికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న అసోంలోని పారిశ్రామిక ప్రాంతం.. దిస్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఎంపీగా ఆయ‌న త‌న స్థానానికి రాజీనామా స‌మ‌ర్పించ‌డంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

సీఎంకు దూర‌పు బంధువ‌నా?!

ప్ర‌స్తుతం ఉప ఎన్నిక మాట ఎలా ఉన్నా.. ఈ టికెట్‌ను ఐఏఎస్ అధికారి దేవాశిష్‌కు ఎందుకు ఇచ్చార‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. రాజకీయ వ‌ర్గాల్లోనూ ఇదే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. దీనికి విశ్లేష‌కులు చెబుతున్న స‌మాచారం మేర‌కు.. ఐఏఎస్ దేవాశిష్ శ‌ర్మ‌.. ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ‌కు దూర‌పు బంధువ‌ని అంటున్నారు. అలాగే.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఆయ‌న ఈ ఏడాది ప్రారంభంలో మాస్ట‌ర్ మైండ్‌గా ప‌నిచేశార‌ని.. అందుకే.. ఆయ‌న‌కు ఉప ఎన్నిక‌లో టికెట్ ఇచ్చార‌ని అంటున్నారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం.. ఇటు బీజేపీలోను.. అటు రాజ‌కీయాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags:    

Similar News