ఇండియా హైవేలపై ఇక ఆగనక్కర్లేదు.. దూసుకెళ్లడమే..

ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ అమలులో ఉన్నప్పటికీ టోల్ బూత్ వద్ద ఉన్న బూమ్ బ్యారియర్ తెరచుకోవడానికి ప్రతీ వాహనం వేగం తగ్గించాల్సి వస్తోంది.

Update: 2026-09-12 06:23 GMT

భారత జాతీయ రహదారులపై ప్రయాణించే కోట్లాది మంది వాహనదారులకు ఇది నిశ్చయంగా తిరుగులేని శుభవార్త. టోల్ ప్లాజా అనగానే మన కళ్లముందు మెదిలే పొడవైన లైన్లు.. నిమిషాల తరబడి వేచి చూడటాలు.. బూమ్ బ్యారియర్‌లు ఇకపై చరిత్ర పుటలకే పరిమితం కానున్నాయి. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్.ఎఫ్.ఎఫ్) టోలింగ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తోంది.

ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ అమలులో ఉన్నప్పటికీ టోల్ బూత్ వద్ద ఉన్న బూమ్ బ్యారియర్ తెరచుకోవడానికి ప్రతీ వాహనం వేగం తగ్గించాల్సి వస్తోంది. అయితే కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్.పీ.ఆర్) , ఫాస్ట్‌ట్యాగ్ సమన్వయ సాంకేతికత ద్వారా వాహనాలు కదులుతున్న వేగంలోనే కెమెరాలు వాటి వివరాలను గుర్తిస్తాయి. వాహనం హైవేపై ప్రయాణిస్తున్నప్పుడే టోల్ రుసుము ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ అవుతుంది. దీనివల్ల డ్రైవర్లు టోల్ బూత్‌ల వైపు వాహనాన్ని మళ్లించడం.. గంటల తరబడి వరుసల్లో నిలబడడం వంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.

ఈ మార్పు కేవలం ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికే పరిమితం కాకుండా దేశ ఆర్థిక రంగానికి , పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. టోల్ ప్లాజాల వద్ద పదే పదే బ్రేకులు వేయడం, మళ్లీ వేగం పెంచడం తగ్గడం వల్ల లీటర్ల కొద్దీ ఇంధనం ఆదా అవుతుంది. వాహనాలు ఆగి ఉండే సమయం తగ్గడంతో కార్బన్ ఉద్గారాలు తగ్గి వాయు కాలుష్యం గణనీయంగా అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం టోల్ వసూలు నిర్వహణకు అవుతున్న వ్యయాన్ని 15 శాతం నుండి కేవలం 3 నుండి 4 శాతానికి తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ అత్యాధునిక విధానం ఇప్పటికే గుజరాత్‌లోని చోరయాసి, ఢిల్లీ పరిధిలోని ముండ్కా-బక్కర్వాలా ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతంగా ప్రారంభమైంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ప్రధాన రహదారులన్నింటికీ దీనిని విస్తరించనున్నారు. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన ప్రకారం 2027 ప్రారంభం నాటికి దేశవ్యాప్తంగా ఈ 'బారియర్ ఫ్రీ' టోలింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ స్మార్ట్ హైవే యుగంతో భారత రోడ్డు రవాణా వ్యవస్థ సరికొత్త శిఖరాలను తాకనుంది.

Tags:    

Similar News