రూ.14 వేల కోట్లు చెల్లించినా.. 'విజయ్ మాల్యా'కు జైలు వాసం తప్పేలా లేదు

ఈ క్రమంలో ఈడీ చొరవ తీసుకుని.. ఆయనకు సంబంధించిన భారీ ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద జప్తు చేసింది.

Update: 2026-09-12 09:23 GMT

బ్యాంకులను వేల కోట్ల రూపాయలలో ముంచి దేశం దాటిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరోసారి తీవ్ర న్యాయపరమైన షాక్ తగిలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు ఆయన నుంచి ఏకంగా రూ. 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి విక్రయించి తిరిగి రికవరీ చేసినప్పటికీ ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు ముగిసే ప్రసక్తే లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం.. ఆస్తుల జప్తు

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో వివిధ భారతీయ బ్యాంకుల నుండి తీసుకున్న వేల కోట్ల రుణాలను చెల్లించకుండా ఎగవేసిన ఆరోపణలపై మాల్యా తీవ్ర ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత్‌లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈడీ చొరవ తీసుకుని.. ఆయనకు సంబంధించిన భారీ ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద జప్తు చేసింది. తాజాగా ఆ ఆస్తులను విక్రయించడం ద్వారా లభించిన రూ.14 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు బదిలీ చేసినట్లు దర్యాప్తు సంస్థ బాంబే హైకోర్టుకు నివేదించింది.

ఆర్థిక పరిహారం వేరు.. క్రిమినల్ నేరం వేరు

రూ. 14,000 కోట్లకు పైగా బకాయిలు రికవరీ అయినందున బ్యాంకులతో తనకున్న ఆర్థిక వివాదం దాదాపుగా ముగిసిపోయిందని కాబట్టి తనపై ఉన్న క్రిమినల్ , మనీలాండరింగ్ కేసులను కొట్టివేయాలని మాల్యా తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ వాదనను ఈడీ గట్టిగా వ్యతిరేకించింది.

ఈడీ ప్రధాన వాదనలు

బ్యాంకుల బకాయిలు లేదా నష్టాన్ని భర్తీ చేయడం అనేది కేవలం ఆర్థిక రికవరీకి సంబంధించిన అంశం. కానీ మనీలాండరింగ్ అనేది తీవ్రమైన నేరపూరిత చర్య. కేసులు రద్దు కావని.. రుణాల డబ్బు తిరిగి రాగానే ఆటోమేటిక్‌గా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవని.. జప్తు చేసిన నిధులను బ్యాంకులకు ఇవ్వడం ఒక అధ్యాయమైతే.. నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీలపై జరిగే చట్టపరమైన విచారణ దాని సొంత పరిధిలోనే కొనసాగుతుందని ఈడీ స్పష్టం చేసింది.

న్యాయపోరాటం కొనసాగుతుంది

ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఇప్పటికే విదేశాంగ, దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆర్థిక రికవరీ పూర్తయినంత మాత్రాన చట్టం ముందు నుండి తప్పించుకోలేరని.. మనీలాండరింగ్ కేసుల్లో బాధ్యత వహించాల్సిందేనని ఈడీ తాజా వాదనతో తేలిపోయింది. ఈ పరిణామం ఆర్థిక అక్రమాలకు పాల్పడేవారికి ఒక బలమైన హెచ్చరికగా నిలవడమే కాకుండా సివిల్ రికవరీకి.. క్రిమినల్ నేర విచారణకు ఉన్న వ్యత్యాసాన్ని మరోసారి స్పష్టం చేసింది.

Tags:    

Similar News