మాకంటే మాకే.. విజయవాడ మేయర్ పీఠంపై తమ్ముళ్ల ఆశలు..!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది.
త్వరలోనే జరగనున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల విషయంలో అధికార పార్టీ టీడీపీలో ఆశావహులు క్యూ కడుతున్నారు. వారిలో చాలా మంది కీలకమైన మేయర్, మునిసిపల్ చైర్మన్‌పదవులపైనే కన్నేశారు. ముఖ్యంగా కీలకమైన విజయవాడ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు లెక్కకు మిక్కిలిగా నాయకులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం ఉంది.. ఎవరి హవా నడుస్తోంది? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమి విజయవాడలో పూర్తి పట్టుతో ఉన్నాయి. 2024 సాధారణ ఎన్నికల విజయోత్సాహం స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా మేయర్ పీఠంపై టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీ మెజారిటీతో మేయర్ పీఠం దక్కుతుందని పార్టీ నేత, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. మేయర్ రేసులో పోటీ తీవ్రంగా ఉంది. మేయర్ పదవి కోసం పార్టీలో లాబీయింగ్ జోరుగా సాగుతోంది. గన్నే వెంకటనారాయణ ప్రసాద్, గద్దె అనురాధ(విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య), చెన్నుపాటి ఉషారాణి వంటి నేతలు రేసులో ఉన్నారు. అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుడు కూడా ఈ పీఠం దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించారు.
ఒకవేళ మేయర్ పదవిని బీసీ అభ్యర్థికీ కేటాయిస్తే, ఎర్రబోతు రామారావు, కాకు మల్లికార్జున్ యాదవ్ తదితరులు రేసులో నిలిచేందుకు రెడీ అయ్యారు. మరోవైపు 2024 ఎన్నికలలో విజయవాడలో పోటీ చేయని జనసేన పార్టీ సైతం మేయర్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. అమ్మిశెట్టి వాసు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పి. సుబ్బారాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పొత్తులో భాగంగా జనసేన కూడా కొన్ని కార్పొరేటర్ స్థానాలు, మేయర్ పీఠాన్ని ఆశిస్తుండటంతో, సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.