ఆ 'సొమ్ములు' ఎక్క‌డికెళ్లాయో.. తేలుస్తారా..!

రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా భావించిన మద్యం కుంభకోణం కేసులో తాజాగా జరిగిన కీలక పరిణామం ఈ కేసు మూలాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు;

Update: 2025-10-03 05:10 GMT

రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా భావించిన మద్యం కుంభకోణం కేసులో తాజాగా జరిగిన కీలక పరిణామం ఈ కేసు మూలాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వైసిపి హయాంలో నూతనంగా అమలు చేసిన మద్యం విధానం ద్వారా వైసిపి నాయకులు, అదేవిధంగా ఆ పార్టీ అధినేత జగన్ కూడా భారీ ఎత్తున ప్రజల సొమ్మును దోచుకున్నారు అన్నది కూటమి నాయకుల ప్రధాన వాదన. అయితే, దీనిలో ఎవరెవరికి ఎంత సొమ్ము చేరింది? ఎవరెవరు ఎంత సొమ్ము తిన్నారు? అనే విషయాలపై ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

ఇక ఈ కేసులో నగదును తరలించే విషయం, అదే విధంగా డిస్టలరీలకు టార్గెట్లు పెట్టే విషయం, అలాగే ఎవరి నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలనే విషయాలను నిర్ణయించిన వ్యక్తిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఏ-4గా నమోదు చేయటం తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుమారు 71 రోజులపాటు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి తాజాగా విడుదలయ్యారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

ఇక ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారిని గమనిస్తే చాలామంది ఇటీవల బయటికి వచ్చారు. వారికి కూడా షరతులతో కూడిన బెయిల్ లభించింది. మరి ఇంత ప్రతిష్టాత్మకమైన కేసులో ఈ విధంగా కీలక నిందితులుగా ఉన్న వారికి బెయిల్ వస్తుండడం పట్ల ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. అసలు మద్యం కుంభకోణంలో సీరియస్ నెస్ ఉందా? లేక రాజకీయ పరంగానే ఈ కేసు నమోదు చేశారా? అనేది ప్రధాన ప్రశ్న. వైసీపీ నాయకులు దీనిని రాజకీయ కోణంలోనే నమోదు చేశారని చెబుతుండగా కూటమి పార్టీల నాయకులు మాత్రం 3500 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని అంటున్నారు.

దీనిలో ప్రధాన మొత్తం వైసిపి అధినేతకే వెళ్లి ఉంటుందని భావిస్తున్నామని హోం మంత్రి అనిత కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఇక ఇతర మంత్రులు సైతం జగన్ త్వరలోనే జైలుకు వెళ్తాడని చెప్పగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో అడుగు ముందుకు వేశారు. జగన్ను అరెస్ట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకే తరలించాలని, ఆయన కోసం తాను అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తానని ఆయన చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇలా కూటమి నాయకులు వైసిపి అధినేత జగన్నే అరెస్టు చేసే స్థాయికి ఈ కేసు చేరుతుందని చెబుతున్నారు.

అయితే, తాజాగా మాత్రం ఒక‌రి తర్వాత ఒకరుగా బయటకు వస్తుండడం, వారందరికీ షరతులతో కూడిన బెయిల్ లభిస్తుండడం పట్ల అసలు ఈ కేసు వ్యవహారం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇటీవల ఏసీబీ కోర్టులో వెల్లడించిన వివరాలను కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఏ ఆధారాలతో మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని.. ఎవరో దారిన పోయే దానయ్య చెప్పాడని అరెస్టు చేస్తారా.. అని ప్రశ్నించటం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసు విచారణ ఏ మేరకు సక్సెస్ అవుతుంది? ఏ దిశగా ముందుకు సాగుతుంది అనేది చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ కేసు విషయం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం తీవ్రంగానే ఉంటున్నాయ‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News