కాపీ కొట్టకు...కాలువలో పడతావ్ !

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే అది. ఫలితం ఆశించకుండా కర్మ చేయమన్నాడు. కానీ ఈ రోజులలో అతి ఆలోచనలతో చాలా మంది ముందే ఫలితాన్ని ఊహిస్తున్నారు.;

Update: 2026-04-26 05:31 GMT

జీవితం అన్నది అతి పెద్ద పరీక్షా పత్రం అయితే జవాబులు ఎవరి మటుకు వారే రాయాలి. వారే తమ సొంత బుర్రకు పదును పెట్టాలి. సులువుగా ఉందనో ఈజీగా దొరికిందనో ఎదుటి వాడిని పక్క వాడినీ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తే నేరుగా వెళ్ళి మురికి కాలువలో పడతావు. నీ ముందు వాడికి అది కాలువ అని తెలుసు, అడ్డొస్తే దాటేసి ముందుకు పోతాడు, నీవు కాపీ కొడుతున్నావ్ కాబట్టి ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా పోతావ్, మురికి కూపంలో పడతావు. అందుకే జీవితం అంటే తమాషా కాదు, కాపీ కొట్టి పాస్ అయ్యే పరీక్ష అంతకంటే కాదు.

అనుకరించకు :

చాలా మందికి తెలిసిన విద్య ఒకరిని అనుకరించడం. వారు బాగున్నారని సక్సెస్ అయ్యారని తామూ అలాగే కావాలని భావించి వారినే అనుకరిస్తారు. కానీ ఈ అనుకరణ ఎపుడూ విజయవంతం కాదు, కొన్ని సార్లు ఏదో కలిసి వచ్చినట్లుగా అనిపించినా చివరికి తీసుకెళ్ళి వైఫల్యాల సుడిగుండంలో పడేస్తుంది. ఖర్మ కాలి ఒకటీ ఆరా సక్సెస్ లు వచ్చినా అనుకరణగానే అది మిగిలిపోతుంది కానీ నీ కష్టమని నీ సొంతం అని ఎవరూ అనుకోరు, అందుకే తప్పో ఒప్పో ఒరిజినాలిటీనే నమ్ముకో. ఒరిజిజల్ గానే ఉండు.

మొదలెడితేనే విజయం :

ఎంతటి దూరమైనా తొలి అడుగుతోనే పయనం మొదలవుతుంది. ఆ మొదటి అడుగు వేయడానికి మాత్రం ఎక్కడ లేని శక్తి కూడదీసుకోవాలి. ఎందుకంటే దాని వెనక ఎన్నో ఆలోచనలు, మరెన్నో సందేహాలు ఇంకెన్నో అనుమానాలు భయాలు ఉంటాయి. వాటిని దాటుకుని అడుగు పడిందా అది తొలి విజయం కిందనే లెక్క. ఆ మీదట ప్రయాణం సాఫీగానే సాగుతుంది. గమ్యం ఏమిటో తెలిశాక లక్ష్యం అన్నది నిర్ధారించుకున్నాక పయనంలో అలుపు ఉన్నా అది శరీరానికే కాదు మనసుకు కూడా ఏ మాత్రం బరువు అనిపించదు.

అన్నింటా వేలు పెట్టొద్దు :

ఈ రోజుల్లో అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. దాంతో ప్రతీ వారూ తమలోని లేని టాలెంట్ ని బయటకు తీయాలని కుతూహలపడుతూంటారు. బాత్ రూం సింగర్స్ కూడా సోషల్ మీడియాలో తమ ప్రతిభను చూపించాలని తపన పడుతున్నారు. అయితే ఉత్సాహం ఉండడం తప్పు కాదు, దానికి తొలి ప్రోత్సాహకుడివి నీవే కావాలి కూడా. కానీ తెలిసీ తెలియని పనులు చేస్తే అభాసు అవుతారు. పాడాలని ఉంటే దాని మీద ఎంతో కొంత సాధన చేయి. రాయాలని ఉంటే ముందుగా సమాజాన్ని చదువు, ఇంకా ఏ రకమైన కళలోనైనా రాణించాలనుకుంటే బేసిక్స్ ని అయినా నేర్చుకునే ప్రయత్నం చేయ్. ఏమీ కాకుండా అన్నింట్లో వేలూ కాలూ పెడితే అవమానం తప్ప మిగిలేది ఏదీ ఉండదు, చివరికి ఏమీ కాకుండా పోవడం కూడా జరుగుతుంది.

ఫలితం ఊహించొద్దు :

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే అది. ఫలితం ఆశించకుండా కర్మ చేయమన్నాడు. కానీ ఈ రోజులలో అతి ఆలోచనలతో చాలా మంది ముందే ఫలితాన్ని ఊహిస్తున్నారు. దానిని రకరకాలుగా విశ్లేషించి మరీ భయపడుతూంటారు. దాంతో ఎక్కడివారు అక్కడే మిగిలిపోతున్నారు. ఏదైనా చేయాలనుకున్నపుడు గట్టి సంకల్పం ఉండాలి. అదే ముందుకు తీసుకుని వెళ్ళే సాధనం అని గ్రహించాలి. గెలుపు ఓటములు అన్న ఫలితాల గురించి తరువాత మాట్లాడుకోవచ్చు. ప్రయత్నం చేయడమే గొప్ప విజయం అన్నది ఎంత మందికి తెలుసు. ఆ విధంగా ఆలోచించిన వారే జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటారు. అందువల్ల ప్రయత్న లోపం అన్నది నీ వైపు నుంచి లేకుండా చూసుకోవాలి.

క్లారిటీ మిస్ కాకు :

దేని మీద అయినా ఒక స్పష్ట అన్నది ఉండాలి. అదే విజయానికి బాటలు వేస్తుంది. నీ దగ్గరే స్పష్టత లేనపుడు ఎదుటి వారికి ఏమని చెబుతావు, ఏ విధంగా సమర్ధించుకుంటావు. కాబట్టి క్లారిటీ పెంచుకో మిత్రమా అన్నది నిపుణులు అందించే గొప్ప సూచన. ఏది ఏమైనా నీవు ఒకరికి స్పూర్తిగా మారకపోయినా ఫరవాలేదు కానీ వైఫల్యానికి కేరాఫ్ గా మాత్రం మిగలకు అన్నది పెద్దలు తలపండిన వారు అందించే మరో ముఖ్యమైన సలహా. వీటిని దృష్టిలో పెట్టుకుని జీవితంలో అడుగులు వేస్తే ఉన్నంతలో బాగానే ఉంటుంది అన్నది మేధావుల మాట.

Tags:    

Similar News