హ్యాపీగా నటించు...అందులోనే జీవించు !

నటన తప్పదు. జీవితం రక్తి కట్టాలంటే నటన చాలా అవసరం. నటించడం చేత కాని వాడికి జీవించే అర్హత లేనట్లే. కఠినంగా ఉన్నా జీవిత సత్యం అంటే ఇదే.;

Update: 2026-05-03 17:07 GMT

నటన తప్పదు. జీవితం రక్తి కట్టాలంటే నటన చాలా అవసరం. నటించడం చేత కాని వాడికి జీవించే అర్హత లేనట్లే. కఠినంగా ఉన్నా జీవిత సత్యం అంటే ఇదే. జీవితమే ఒక నాటకం అని పెద్దలు ఏనాడో అన్నారు. అందువల్ల నటించాలి. ఇలా నటించడం ఎంత కాలం అంటే జీవించి ఉన్నంత కాలం అన్నదే జవాబు. నటన ఎందుకు అంటే జీవించడం కోసం అన్నది కూడా అనుబంధ జవాబు. మరి సహజత్వం ఉండరాదా, జీవితం అంటే నటనేనా అంటే అన్ని సందర్భాలలో కాదు అవసరమైన అంత మేరకు నటించాల్సిందే ఉంటుంది. జీవిత సారం అదే చెబుతోంది. జీవిత పాఠం కూడా అదే కరెక్ట్ అంటోంది.

పాత్రకు న్యాయం చెయ్ :

మనిషికి జీవితంలో ఎన్నో పాత్రలు ఉంటాయి కొడుకుగా తండ్రిగా కూతురుగా తల్లిగా కోడలుగా అత్తగా అవ్వగా, తాతగా బాబాయ్ మామయ్యగా ఇలా పాత్రలన్నీ కూడా సమర్థంగా నటించాలి. అందులోనే జీవించాలి అంటే ఏ పాత్రలో ఎంత మేరకు అవసరం అయితే అంత మేరకూ నటించాలి, అపుడే సక్రమంగా జీవించినట్లు అన్న మాట. అందువల్ల జీవితం నటనని వేరేవి అనుకోవాల్సిన అవసరం లేదు. నటనలో పండిన వారే జీవితంలో రాణిస్తారు. వారే సక్సెస్ లను చవి చూస్తారు. ఆ విషయం తెలియని వారు అమాయకంగా అలా చూస్తూ జీవితానికి క్రీనీడలా నిలిచిపోతారు.

నవ్వుల పౌడర్ పూసుకో :

ఇక్కడ ఇంకో విషయం మన బాధలు మనసులో దాచుకోవాలి. వాటికి పౌడర్ లాంటి నవ్వు పులిమి బయటకు రావాలి. అందరిలోనూ ఆనందంగా ఉన్నట్టుగా చాటుకోవాలి. ముఖ్యంగా పదిమందిలోకి వెళుతున్నప్పుడు మాకేంటి అంతా బాగానే ఉంది అనిపించేలా బాడీ లాంగ్వేజ్ తో సైతం మార్చుకుని తెగ నటినాలి. అలా కాకుండా దైన్యంగా హీనంగా కనిపిస్తే అవతల వాళ్ళు ఏమిటి నీ సమస్య అని అడగరు, కర్చీఫ్ తెచ్చి కళ్ళు ఒత్తి ఓదార్చరు. పైగా వేళాకోళం చేస్తారు. అంటే అందరిలోకీ వెళ్ళి వెంట తెచ్చుకునేది మరింత బాధ అన్న మాట. పదిమందిలోకి వెళ్లి బాధని కొనుక్కోవడం అంటే ఇదే.

నటన రక్షణ కవచం :

ఇక ఫంక్షన్స్ ఇతరత్రా కార్యక్రమాలు పార్టీలు ఇవన్నీ జీవితంలో తప్పనిసరి వ్యవహారాలుగా మారిపోయాయి. వాళ్ళు పిలుస్తున్నారు కదా అని వెళ్లక తప్పని పరిస్థితులు. అయితే ఇలాంటి సందర్భాల్లో మనకి రక్షణ కవచంగా ఉండేది నటన మాత్రమే సుమా. తీరా అక్కడికి వెళ్తే ఏం చేస్తున్నావ్ ఏంటి ఈ సంపాదన ఎలా ఉంది. అంతా బాగున్నారా అన్నప్పుడు మనం చాలా బాగా యాక్ట్ చేయాలి, అంతా బాగుంది హ్యాపీగానే ఉంది అని గుండె లోతుల్లోంచి గట్టిగా దిట్టాంగా చెప్పాలి. ఏదో పొడిపొడిగా చెప్తే అవతల వాళ్ళకి డౌట్ వస్తుంది. అలా డౌట్ వస్తే చాలు ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతాం. అందువల్ల వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరు ఎవరిని పట్టించుకోని సమాజంలో మనం ఆ మాత్రం నటించడం మన మంచికే అన్నది తెలివిగా తెలుసుకోవాలి.

రిటర్న్ గిఫ్ట్ అవసరమా :

మనం బాగా లేమని అంటే మాత్రం అయ్యో పాపం అంటారా. లేని పోని వేళాకోళాలు వెటకారాలు మనకి రిటర్న్ గిఫ్ట్ గా పంపిస్తారు. ఇవన్నీ అవసరమా. అందుకే ఫంక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు కానీ పదిమందిలో కలిసినప్పుడు అంత బాగుందనిపించేలా మన బిహేవియర్ ఉండాలి. వేసుకున్న డ్రస్ నుంచి ఫేసులో నవ్వు నుంచి మన బాడీ లాంగ్వేజ్ నుంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనం బాగా నటించడం. అలా ఉండకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం. ఈ సమాజం ఎలా ఉందంటే డబ్బు ఉన్న వాడినే గౌరవిస్తారు. బుర్రలో గుజ్జు ఎంత ఉందని అడగరు, అది కూడా పైకి ఎలా తెలుస్తుంది. అందుకే పైకి కనిపించే హంగూ ఆర్భాటాలనే అంతా చూస్తారు. ఎంతసేపు కూడా డబ్బునే చూస్తారు గౌరవిస్తారు. ఆస్తులు ఏమిటని వాకబు చేస్తారు. అందువల్ల నటన చాలా అవసరం. మన పెద్దలు దానికే లౌక్యం అని పేరు పెట్టారు. అప్పుడే సౌఖ్యం అని కూడా అన్నారు. ఈ విషయం తెలియని వాళ్ళు ఇంట బయటా కూడా కుమిలిపోతూనే ఉంటున్నారు.

అద్దం నీ నేస్తం :

బాధలు ఈ సమస్యలు ఎవరితోనూ చెప్పుకోకు. నటించు వీలైనంతవరకూ అందులోనే జీవించు ఆ నటనలోనే తరించు. అప్పుడే నీకు హాయిగా ఉంటుంది. ఈ మధ్యలో నీలో తాడెత్తుగా అంతరాత్మ లేచి నిన్ను ప్రశ్నిస్తుంది. ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నావ్ అని గట్టిగానే నిలదీస్తుంది. కానీ కాసేపు దాని నోరు నొక్కాల్సిందే. ఎందుకంటే ఈ కుహానా ప్రేమాభిమానాలు, ఈ కృత్రిమ సమాజంలో ఉన్న పోకడలూ పరిస్థితులు పాపం అంతరాత్మకి ఏమీ తెలుసు. అందుకే కాస్త దాని ఊరుకో బెట్టి చేయాల్సిన నటన అంతా చేసేసి ఇంటికొచ్చి ఆ మీదట నీ బాధలు కష్టాలు నీతో నీవే చెప్పుకో. అద్దం ముందు నిలబడి అన్నీ కక్కేసెయి. వీలైతే దేవుడు పటానికి వెళ్లి చెప్పుకో. ఇంకా వీలైతే అమ్మానాన్న పటాలు కూడా వెళ్లి చెప్పుకో దానివల్ల నీకు ఓదార్పు లభిస్తుంది అంతే తప్ప బయట పడకు. పదిమందిలో చులకన అయిపోతావ్. ఇది నీ మంచికే సుమా. అందుకే నటించడం నేర్చుకో. లేకపోతే జీవించడం చాలా కష్టం అయిపోతుంది.

Tags:    

Similar News