అమరావతి రైతుల బెంగని మోడీ తీరుస్తారా ?
అమరావతి రైతులకు తీరని బెంగ పట్టుకుంది. అదేమిటి అంటే రాజధాని వ్యవహారమే. 2015లో తాము స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని రాజధాని కోసం త్యాగాలు చేశామని అమరావతి రైతులు అంటున్నారు.;
అమరావతి రైతులకు తీరని బెంగ పట్టుకుంది. అదేమిటి అంటే రాజధాని వ్యవహారమే. 2015లో తాము స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని రాజధాని కోసం త్యాగాలు చేశామని అమరావతి రైతులు అంటున్నారు. తీరా చూస్తే ఇప్పటికి దశాబ్దం అయింది కానీ అనుకున్నది సరిగ్గా జరగలేదని చెబుతున్నారు ఇక చూస్తే మొత్తానికి రాజధాని రైతులకు ప్లాట్లను ఇస్తున్నారు. ఇంకా ఇవ్వాల్సిన వారి జాబితా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే అసలైన విషయం మరొకటి ఉంది. దాని మీదనే ఎక్కువగా అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు అని అంటున్నారు.
ఆ ముద్ర పడాల్సిందే :
అమరావతిని రాజధానిగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పేర్కొంది. అలా 2019 దాకా టీడీపీ రాజధాని కోసం డిజైన్లు ప్లాన్ చేస్తూ పోయింది. ఇంతలో ఎన్నికలు వచ్చి టీడీపీ ఓటమి పాలు అయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ వస్తూనే మూడు రాజధానుల పాటను పాడింది. అయిదేళ్ల పాటు మూడు రాజధానుల విషయం ఒక్క అడుగు ముందుకు సాగకపోయినా అమరావతిని మాత్రం పాడు పెట్టేశారు అన్నది అయితే ఉంది. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాజధానికి కదలిక వచ్చింది. ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొంత మేర పురోగతిని సాధించేందుకు టార్గెట్ ని పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే అసలు విషయంలో మాత్రం రైతులు కలవరపడుతున్నారు అదే రాజముద్ర. అమరావతి రాజధానిని గుర్తిస్తూ పార్లమెంట్ లో విభజన చట్టానికి సవరణ తెస్తూ ఆమోదం తెలపాలి. ఆ మీదట రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అపుడు కానీ రాజముద్ర పడదు.
భారీ తతంగమే :
ఇక చూడడానికి ఇది సింపుల్ గా అనిపించవచ్చు కానీ తతంగం మాత్రం చాలానే ఉంది అని అంటున్నారు. అయితే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ సపోర్టు అవసరం. ఇక ఏపీలో కూడా కూటమి సర్కార్ లో బీజేపీ ఉంది. దాంతో అమరావతి రాజధాని విషయంలో బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉంటారనే అంతా భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ లో విభజన చట్టం సవరణ బిల్లు ఆమోదానికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అది ఎన్డీయేకు ఉంది. కానీ విభజన చట్ట సవరణ అంటే తెలంగాణా నుంచి ఏ రకమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు వారు ఏమైనా కొత్త ప్రతిపాదనలు పెడతారా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు.
అమరావతికి శ్రీరామరక్షగా :
మరో వైపు ఏపీ కంటే బీజేపీకి తెలంగాణా మీద ఎక్కువ ఆశలు ఉన్నాయి. దానిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ తెలంగాణా కోసం ఏమైనా కొత్త ప్రతిపాదనలు తెస్తే వాటిని కూడా పెట్టి సవరణలు చేయాలా అన్న చర్చ కూడా ఉంది అవి ఇబ్బందికరంగా కాకపోతేనే వీలు అవుతుంది కానీ రాజకీయంగా ముడిపడి ఉన్నవి ఉన్నా లేక రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూల మీద ఉన్నా అది ఇరకాటం అవుతుంది అని అంటున్నారు. దాంతో ప్రస్తుతం అంతా సాఫీగా ఉంది కదా ఎందుకు కోరి విభజన చట్టంలో సవరణలు చేయడం అనుకుంటే మాత్రం కొంత జాప్యం జరిగే వీలు ఉంది అని అంటున్నారు. అయితే అమరావతి రైతుల బెంగ అర్థం చేసుకోతగినది అంటున్నారు. రాజకీయాల్లో ఎవరి ధీమా వారికి ఉన్నా ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా అలాంటపుడు అనుకోని పరిణామాలు ఏమైనా జరిగితే రాజముద్ర మాత్రమే అమరావతికి శ్రీరామరక్షగా ఉంటుంది అన్నదే రైతుల మాటగా ఉంది అని అంటున్నారు.