భగ్గుమన్న లద్దాఖ్.. ఆందోళనల వెనుక కారణం ఇదేనా..?
ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 24) రోజున లేహ్ నగరంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్రహోదాపై వెల్లువెత్తిన నిరసనలు పక్కదాని పట్టాయి.;
ప్రపంచంలో చాలా దేశాలు అంతర్గత కల్లోలంతో బాధలు పడుతున్నాయి. దేశాలకు, దేశాలకు మధ్య యుద్ధం ప్రారంభం కావడం ఒక ఎత్తయితే.. అంతర్గత పరిస్థితులు మరో ఎత్తు. భారత్ ను టార్గెట్ చేసుకున్నారా..? అనే విధంగా భారత్ చుట్టు పక్కన దేశాల్లో అంతర్గత అల్లకల్లోలం సంభవించి నాశనం అయ్యాయి. మొదట బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని దించేందుకు అంతర్గతంగా పెద్ద యుద్ధమే జరిగింది. యూనుస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు సద్దుమణిగినా దేశ ప్రగతి కొన్నేళ్ల వెనక్కు వెళ్లింది. దీనికి ముందు శ్రీలంకలో కూడా ఇలాంటి సంక్షోభమే వచ్చింది. ఇక మొన్నటికి మొన్న నేపాల్ లో ఇలా అంతర్గత కలహాలు చెలరేగి దేశాలు ఇబ్బంది పడుతున్నాయి.
కొంత కాలం నుంచి వినిపిస్తున్న డిమాండ్..
భారత్ లో కొన్నేళ్లుగా మణిపూర్ లో జరుగుతున్న వివాదాలు మొన్నటికి మొన్న సద్దుమణిగాయి. దీంతో దేశం ఊపిరి పిల్చుకుంటున్న సందర్భంలో లద్దాఖ్ లో నిరసనలు మొదలయ్యాయి. ఇవి కాస్తా ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం వరకు దారి తీశాయి. బీజేపీ ప్రభుత్వం జమ్ము-కశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జమ్ము-కశ్మీర్ కు రాష్ట్ర హోదా.. లద్దాఖ్ కు యూనియన్ టెరిటరి (కేంద్ర పాలితప్రాంతం) కింద ఏర్పాటు చేసింది. అయితే యూనియన్ టెరిటరీ తమకు వద్దని లద్దాఖ్ వాసులు నిరసనలు చేస్తున్నారు. రాష్ట్ర హోదా కోసం సోనమ్ వాంగ్ చుక్ అనే పర్యావరణ ఉద్యమకారుడు రెండు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. తమ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్ కిందకు చేర్చాలని కోరుతున్నాడు.
అక్టోబర్ లో చర్చలకు ఆహ్వానం..
ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 24) రోజున లేహ్ నగరంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాష్ట్రహోదాపై వెల్లువెత్తిన నిరసనలు పక్కదాని పట్టాయి. పట్టణంలోని బీజేపీ కార్యాలయంకు, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇక్కడే ఇదే తొలిసారి. వీరి డిమాండ్లపై గతంలోనే ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఆ కమిటీతో చర్చలు జరిగినా అవి ఫలవంతం కాలేదు. దీంతో నిరసనలు మొదలయ్యాయి. అక్టోబర్ 6వ తేదీ చర్చలకు రావాలని ప్రభుత్వం అక్కడి ప్రముఖులకు సూచించింది.
నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం..
అయితే.. ఈ నిరసనలను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రజల న్యాయమైన డిమాండ్ల నుంచి పుట్టాయా? లేదంటే ఇతర శక్తులు ఇందులో ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నేపాల్ లో సంక్షోభం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా నిరసనలు వెల్లివిరియడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.