లద్దాఖ్‌ ప్రజలకు గుడ్ న్యూస్.. స్థానికతపై కేంద్రం కీలక ప్రకటన

తమ సంస్కృతి, భాష, భూమికి రక్షణ కల్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతున్న లద్దాఖ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.;

Update: 2025-06-04 02:30 GMT

తమ సంస్కృతి, భాష, భూమికి రక్షణ కల్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతున్న లద్దాఖ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై లద్దాఖ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకే దక్కనున్నాయి. ఇది అక్కడి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చడమే అని చెప్పాలి. కొత్త నిబంధనల ప్రకారం.. లద్దాఖ్‌ పరిపాలన నిమిత్తం ఏర్పడిన కౌన్సిల్‌లలో మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళల కోసం కేటాయించారు. ఇది మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, భూటి, పుర్గి భాషలను లద్దాఖ్‌ అధికార భాషలుగా ప్రకటించారు. ఇది అక్కడి ప్రజల భాషలకు గుర్తింపు ఇస్తుంది.

స్థానిక గుర్తింపు ఎలా వస్తుంది?

లద్దాఖ్‌లో 15 సంవత్సరాలు నివసించినవారు, లేదా 7 సంవత్సరాలు అక్కడే చదువుకుని, 10వ లేదా 12వ తరగతి పరీక్షలు రాసినవారు – వీరికి స్థానిక గుర్తింపు (డొమిసైల్) లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పిల్లలు కూడా 10 సంవత్సరాలు లద్దాఖ్‌లో పని చేసి ఉంటే ఈ గుర్తింపుకు అర్హులు. ఈ స్థానిక గుర్తింపు ధృవీకరణ పత్రం కేవలం లద్దాఖ్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే పని చేస్తుంది.

డిమాండ్లకు తగ్గట్టుగా మార్పులు!

2019లో జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అప్పటి నుంచి అక్కడి ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారి డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల ఆధారంగానే ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ చర్యలు లద్దాఖ్‌లో మరింత అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News