ఉక్రెయిన్ లో భారత ఫార్మా సంస్థపై క్షిపణి దాడి.. రష్యా పనే..?

తాజాగా కీవ్ లోని భారత ఫార్మా సంస్థ గోదాంపై క్షిపణి దాడి జరిగింది. ఇది ఎవరు చేశారనేది మాత్రం బయటపడడం లేదు.;

Update: 2025-04-19 12:30 GMT

షెడ్యూల్ ఖరారైతే సరిగ్గా నెల రోజుల్లో భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఆ దేశ విక్టరీ డే పరేడ్ కు హాజరవనున్నారు. సహజంగా మోదీ ఏ దేశానికి వెళ్లినా భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతుంటారు. కాగా, రష్యా మూడేళ్ల రెండు నెలలుగా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశ మౌలిక వసతులను కూడా ధ్వంసం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కూడా వదలడం లేదు.

తాజాగా కీవ్ లోని భారత ఫార్మా సంస్థ గోదాంపై క్షిపణి దాడి జరిగింది. ఇది ఎవరు చేశారనేది మాత్రం బయటపడడం లేదు. ఉక్రెయిన్ ఏమో రష్యా పనే అని ఆరోపిస్తోంది. రష్యన్ రాయబార కార్యాలయం మాత్రం.. ఉక్రెయిన్ వైమానిక దళం చేసిందని చెబుతోంది.

కీవ్ లో కుసుమ్ హెల్త్ కేర్ అని ఓ ఫార్మా సంస్థ ఉంది. యజమాని రాజీవ్ గుప్తా. దీని ‘గ్లాడ్‌ ఫార్మ్’ యూనిట్ పై ఈ నెల 12న కుసుమ్ హెల్త్ కేర్ గోదాంపై క్షిపణి దాడి జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు చూస్తే.. ఓ క్షిపణి నేరుగా గోదాంను ఢీకొట్టింది. అది రష్యాదే అని ఉక్రెయిన్, కాదు ఉక్రెయిన్ దే అని రష్యా ఆరోపిస్తోంది.

తమ సైన్యం ఎప్పుడూ భారత ఫార్మా సంస్థలను టార్గెట్ చేసుకోలేదని రష్యా చెబుతోంది. భారత్ లోని రష్యా రాయబార కార్యాలయం కూడా ఇది ఉక్రెయిన్ పనే అని పేర్కొంది.

భారీగా నష్టం..

కుసుమ్ హెల్త్ కేర్ పై క్షిపణి దాడిలో ఆ సంస్థ భారీగా నష్టపోయింది. ఉక్రెయిన్‌ లోని అతిపెద్ద ఫార్మా సంస్థల్లో ఇది ఒకటి. ప్రాథమిక ఔషధాలను సరఫరా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

12న కుసుమ్ ప్లాంట్‌ లో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీకి దాదాపు 25 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. రష్యా ఔషధ యూనిట్లను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ ఆరోపించింది.

అయితే, రష్యా మాత్రం ఉక్రెయిన్ క్షిపణి లక్ష్యాన్ని చేధించడంలో విఫలమై జనావాస ప్రాంతంలో పడిపోయిందని చెబుతోంది. తాము ఎప్పుడూ పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పట్టణాల్లో వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరిస్తున్నదని, దీంతో పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని తెలిపింది.

కాగా, యుద్ధంలో కుసుమ్ గ్రూప్ తమకు ఎంతో సాయం అందించిందని, అందుకే రష్యా దానిని లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్‌లోని భారత రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ పేర్కొన్నారు.

Tags:    

Similar News