బాలికను హత్య చేసింది వారేనా.. పోలీసుల అనుమానం వెనుక కారణం ఇదే..
కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో పదేళ్ల బాలిక హత్య మిస్టరీగా మారింది. జీ ప్లస్–2 భవనంలో నివాసం ఉంటున్న వారిలో ఎవరో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.;
కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో పదేళ్ల బాలిక హత్య మిస్టరీగా మారింది. జీ ప్లస్–2 భవనంలో నివాసం ఉంటున్న వారిలో ఎవరో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ భవనంలోని ప్రధాన ద్వారం తప్ప బయటివారికి రాకపోకలు సాధ్యం కాని పరిస్థితి ఉందని దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన సోమవారం ఉదయం నుంచే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి ఒకరిని, మంగళవారం మరో ముగ్గురిని విచారణకు తీసుకెళ్లారు. పురోగతి లేకపోవడంతో బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుకను కూడా సమాచారం కోసం పిలిపించారు.
ఆర్థిక లావాదేవీలా.. వ్యక్తిగత కక్షలా?
ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షల కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ భవనంలో నివసించే మరో రాష్ట్రానికి చెందిన యువకుడు చేతబడి నెపంతో హత్య చేశాడనే ప్రచారం వినిపించినా, దీనికి సరైన ఆధారాలు లభించలేదు. తాను అనారోగ్యం కారణంగా తాయెత్తులు వేసుకున్నానని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలిముద్రలు, సెల్‌ఫోన్ డేటా, సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్ మంగళవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
20 కత్తిపోట్లు
బాలిక శరీరంపై సుమారు 20 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అందులో 10 మెడపై ఉన్నాయని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో బాలిక కేకలు వినిపించాయని పొరుగు భవనంలో నివసించే వారు సమాచారం ఇచ్చారు.
పథకం ప్రకారమేనా?
అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి ఇది పథకం ప్రకారం జరిగిన ఘాతుకమని, కక్షతోనే బాలికను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని సోమవారం రాత్రి కుటుంబసభ్యులు స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా మక్తాక్యాసారంలో అంత్యక్రియలు చేశారు.