కేటీఆర్ రాజకీయ చాణక్యం.. చంద్రబాబుపై పొగడ్తల వెనుక పక్కా వ్యూహం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.;

Update: 2026-04-14 11:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ద్రోహి అంటూ చంద్రబాబుపై తరచూ విమర్శలు గుప్పించే కేటీఆర్ ఆకస్మాత్తుగా గొంతు ఎందుకు సవరించుకున్నారనే అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెస్ట్ సీఎం అంటూ చంద్రబాబుతోపాటు వైఎస్ ను కీర్తించడం వెనుక కేటీఆర్ పక్కా రాజకీయ వ్యూహం దాగుందని సందేహిస్తున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టాలనే ప్లాన్ తోనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసివుంటారని అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పాలనను పొగుడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. చంద్రబాబు పాలనతోపాటు టీడీపీ పార్టీ పోరాట పటిమను కేటీఆర్ ప్రస్తావించడం వెనుక ట్రై మున్సిపల్ కార్పొరేషన్లలలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఆకర్షించాలని చూస్తున్నారని అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ తోపాటు కొత్తగా ఆవిర్భవించిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు గణనీయంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో సెటిలర్లు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన మద్దతుదారులైన సీమాంధ్రుల ఓట్ల విషయంలో బీఆర్ఎస్ ధీమాగా ఉందని అంటున్నారు. కానీ, గతంలో తమకు అండదండగా ఉన్న సీమాంధ్ర ఓటర్లలోని టీడీపీ సానుభూతిపరుల ఓట్ల విషయంలో బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొందని విశ్లేషిస్తున్నారు.

ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతో టీడీపీ సానుభూతిపరులు ఇక్కడ కాంగ్రెస్ కు బాసటగా నిలుస్తున్నారని అంచనాలు వెలువడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోపాటు అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లోనూ టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడంతో బీఆర్ఎస్ పార్టీ నష్టపోయిందని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు అండగా నిలిచిన సీమాంధ్రులు ఆ తర్వాత దూరమయ్యారని భావిస్తున్న బీఆర్ఎస్ తిరిగి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగానే వ్యూహాత్మకంగా చంద్రబాబు విషయంలో తాము సానుకూలంగా ఉన్నామని సంకేతాలు పంపేలా కేటీఆర్ ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News