సర్వేల పేరు చెప్పి కామెడీ చేస్తారేంటి కేటీఆర్?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. తమ పార్టీ నిర్వహించిన ఏడు సర్వేల గురించి చెప్పుకొచ్చారు కేటీఆర్.;
సర్వేల పేరు చెప్పి మరోసారి అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్. అయితే.. వచ్చిన చిక్కేమంటే.. ఆయన మాటల్ని విన్నంతనే వావ్ అనేలా గులాబీ పార్టీలోని ఒక బ్యాచ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మరో బ్యాచ్ మాత్రం గతాన్ని గుర్తు చేస్తూ నిట్టూర్పు విడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో కంటే చేతల్లో చూపిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. తమ పార్టీ నిర్వహించిన ఏడు సర్వేల గురించి చెప్పుకొచ్చారు కేటీఆర్. అన్ని సర్వేల్లోనూ పార్టీ గెలుస్తుందన్న విషయం వెల్లడైందన్న ఆయన.. మరో ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కూడా మూడు సర్వేల్ని నిర్వహించింది. అందులోనూ మేమే గెలుస్తామని వచ్చింది’’ అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అయితే.. కేటీఆర్ మాటల్ని గులాబీ పార్టీకి చెందిన కొందరు లోగుట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ సర్వేల గురించి మాట్లాడకపోతేనే బాగుంటుందని చెబుతున్నారు. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ సర్వే ఫలితాల పేరుతో చెప్పిన మాటలన్ని మిస్ ఫైర్ అయిన వేళ.. ఇప్పుడు మళ్లీ సర్వే మాటల్ని చెప్పటం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. సర్వేల ప్రస్తావన వచ్చినంతనే.. కాంగ్రెస్ నేతలు.. రాజకీయ ప్రత్యర్థులు గతాన్ని గుర్తు చేసి తమను ఆడుకుంటారని.. అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలన్నది వారి ఆవేదన.
కేటీఆర్ ప్రస్తావించే ప్రతి మాటకు.. గతంతో రిలేట్ అయి ఉన్న నేపథ్యంలో.. ప్రత్యర్థులకు కేటీఆర్ మాటలు ఆయుధాలుగా మారుతున్నట్లు చెబుతున్నారు. మారిన కాలంతో పాటు.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ సాయంతో.. గతంలో కేటీఆర్ మాట్లాడిన మాటల వీడియో క్లిప్పుల్ని.. తాజాగా చేస్తున్న వ్యాఖ్యలతో చేస్తున్న వీడియోలకు పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ ఇవ్వలేకపోతుందని.. అందుకే.. మాట్లాడే వేళ.. కాస్తంత ఆచితూచి అన్నట్లు మాట్లాడితే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లోగుట్టుగా మాట్లాడుకుంటున్న ఈ మాటల సారాంశం కేటీఆర్ వద్దకు చేరుతోందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.