మోడీ హ్యాట్రిక్ విజయం...రాహుల్ గాంధీ అసమర్థత వల్లేనా?

మోదీ మూడోసారి ప్రధానిగా కూర్చొన్నారంటే దానికి కారణం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసమర్థతే.;

Update: 2025-12-03 05:34 GMT

మోదీ మూడోసారి ప్రధానిగా కూర్చొన్నారంటే దానికి కారణం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసమర్థతే. ప్రధాన పార్టీ నేతగా రాహల్ గాంధీ మోదీ విజయాన్ని నిలవరించడంలో ఘోరంగా విఫలమయ్యారు. అతనో అట్టర్ ఫ్లాప్ నేత... అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వ్యాఖ్యానించడం ఇపుడు రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఇండియా కూటమి కట్టాక గతం కన్నా అధిక సీట్లతో మెరుగైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలుచున్నప్పటికీ....పదిహేనేళ్ళుగా అధికారానికి దూరం కావడం కాస్త ఆలోచించుకోదగ్గ అంశమే. అయితే మోదీ ప్రజల మనసు గెలిచి మూడుసార్లు ప్రధాని కాలేదని, కేవలం కాంగ్రెస్ నేత అసమర్థ నాయకత్వం, బలహీన రాజకీయ వ్యూహాల వల్లే మోదీ విజయం సులువు అయ్యిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఒక రాజకీయ కూటమి వరసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం సాధారణ విషయమేం కాదు. మోదీ అమిత్ షాల చాణక్యం వల్లనే ఇది సాధ్యపడిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. వాజ్ పేయి, అద్వానీ తరం తర్వాత బీజేపీ రాజకీయాల్లో చాలా డైనమిక్స్ మారాయి. ప్రధానంగా మోదీ అధికార పగ్గం చేపట్టినప్పటి నుంచి రాజకీయంగా వేస్తున్న ఎత్తుకుపైఎత్తులు...రాష్ట్రాల్లో వారు అనుసరిస్తున్న పవర్ వ్యూహాలు ప్రత్యర్థి కాంగ్రెస్ కు అందనంత దూరంగా ఉంటున్నాయన్నది మాత్రం వాస్తవం. కొందరు అప్పటి బీజేపీ ఇప్పటి బీజేపీ వేరు అంటూ పెదవి విరుస్తున్నా...విజయానికి ఏం కావాలో...అధికారం నిలుపుకోడానికి ఏం చేయాలో మోదీ అమిత్ ద్వయానికి తెలిసినంత బాగా వేరే రాజకీయ పార్టీ నేతలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలీదనే పరిశీలకులు అంటున్నారు.

ఇదే అంశాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మరోసారి నొక్కి వక్కాణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గాఢ నిద్రలో జారుకుంది. అది నిద్ర లేచే దాకా మోదీని కానీ, బీజేపీని కానీ ఎదురించే రాజకీయశక్తి ఉండదు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి సకాలంలో ఎండగట్టడంలో ప్రధాన ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ దారుణంగా విఫలమయ్యారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ నిరర్థక విధానాల వల్లే మోదీ అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్నారని, మోదీ గెలుపునకు రాహుల్ వైఫల్యమే ప్రధాన కారణమని కేటీఆర్ తేల్చేశారు.

గత కొన్ని దశాబ్దాలుగా వైభవంగా పాలన అందించిన కాంగ్రెస్ కు ఇవాళ కేంద్రంలో అధికారం అందని పండుగా మారుతున్న మాట నిజమే. సోనియా గాంధీ తరం చివరిదశకు వచ్చాక...రాహుల్ గాంధీ పార్టీలో ప్రధాన నేతగా పగ్గాలు చేపట్టడానికే మీనమేషాలు లెక్కించారు. కాంగ్రెస్ యాభైఏళ్లు గడిచినా ఇప్పటికీ గాంధీ కుటుంబం చాటు పార్టీగానే మిగిలిపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. సెక్యూలర్ తన విధానమని కాంగ్రెస్ చెప్పినా...ఆ ముసుగులో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు తెరలేపిందనే బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ మతం పార్టీ అని...ప్రజల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటోందని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా....దేశ ప్రజలు మోదీ పాలనకే మొగ్గు చూపుతుండటం...బీజేపీకే పట్టం గట్టడం లాంటి ధోరణలు కాంగ్రెస్ అధికారావకాశాల్ని మరింత దూరం చేస్తున్నాయని పరిశీలకుల అభిప్రాయం.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ...బీజేపీని నిలవరించే శక్తి ఇపుడు కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలిచి పోరాడాల్సిన సందర్భం వచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంటే దేశంలో మూడో కూటమి అవసరం ఉందని ప్రస్తావిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడారు...కాస్త ప్రయత్నించారు కూడా. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీగా పదేళ్ళు పాలన అందించిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస గా మార్చారు. కానీ అది వర్కవుట్ కాలేదు. బీఆర్ఎస్ నేషనల్ ఫ్రంట్ మాట అటుంచి సొంత రాష్ట్రం తెలంగాణలోనే అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. కేటీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలు ఘాటుగా ఉన్నాయే తప్ప....బీజేపీని నిలువరించేలా లేవని మరికొందరి వ్యాఖ్య.

Tags:    

Similar News