ఎంపీగారి ఉవాచ.. రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరుగుతాయట!
తెలంగాణ సహా.. దేశాన్ని సైతం దిగ్భ్రాంతికి గురి చేసిన చేవెళ్ల బస్సు-ట్రక్కు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.;
తెలంగాణ సహా.. దేశాన్ని సైతం దిగ్భ్రాంతికి గురి చేసిన చేవెళ్ల బస్సు-ట్రక్కు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణం.. రహదారుపై భారీ గొయ్యి ఉండడంతో ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడమేనని అధికారులు తెలిపారు. ఇక, రహదారులపై గోతుల అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే.. ఈ విషయంపై చేవెళ్ల ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఆయన సొంత నియోజకవర్గం పరిధిలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుని పదుల సంఖ్యలో అమాయక ప్రయాణికులు మృ తి చెందారు. అయితే.. దీనిపై ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మరో వైపు చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ''రోడ్లు బాగుంటేనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి. రయ్యన దూసుకుపోతారు. అలా కాదనుకో.. నెమ్మదిగా వెళ్తారు. ప్రమాదాలు తగ్గుతా యి. అసలు జరగవు కూడా'' అని అన్నారు. రహదారులను బాగు చేయకుండా అలా వదిలేయడమే మంచిదని చెప్పుకొచ్చా రు.
అంతేతప్ప.. చేవెళ్ల ఘటనకు.. రహదారిపై గుంతే కారణమన్న దానిని ఆయన సమర్థించడం గమనార్హం. మరి గుంతలో పడితేనే కదా.. ట్రక్కు అదుపు తప్పి.. బస్సుపై ఒరిగిపోయింది!. అనే లాజిక్కును ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మరిచిపోయినట్టున్నారు. ఎంతో సీనియర్ అయిన కొండా.. అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధిగా విజయం దక్కించుకున్నారు. అలాంటి నాయకుడు బాధ్య తగా వ్యవహరించాల్సింది పోయి.. రహదారులపై గుంతలు ఉంటేనే బెటర్ అని చెప్పడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తు న్నారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రహదారులకు ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని ఎంపీ మరిచిపోతున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా రహదారులపై నడిపేవాహనాలకు వేల రూపాయల సెస్సును కూడా ఆపేస్తే.. మంచిదని కొందరు సలహాలు ఇస్తున్నారు. టోల్ గేట్లు.. సెస్సులు, పన్నులు ఇవన్నీ ఆపేయండి ఎంపీగారు.. అప్పుడు రోడ్లు ఎలా ఉన్నా.. ఎవరూ అడగరు.. అని కొందరు వ్యాఖ్యానించారు.