కాంగ్రెస్ లో ‘కొండా లేఖ’కలకలం.. అత్యవసర భేటి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.;

Update: 2025-06-29 20:30 GMT

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు వర్సెస్ స్థానిక ప్రజా ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో కొండా మురళి ఇచ్చిన ఆరు పేజీల ఫిర్యాదు లేఖపై చర్చించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు నేడు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

కొండా మురళి లేఖతో షాకింగ్ ట్విస్ట్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి దంపతులకు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న పరస్పర ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. వారం రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆదేశించింది.

నిన్న గాంధీభవన్‌లో మల్లు రవి అధ్యక్షతన సమావేశమైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ, జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఈ సందర్భంగా కొండా మురళి తన అనుచరులతో సహా దాదాపు 150 వాహనాలతో గాంధీభవన్‌కు చేరుకుని తన బలాన్ని ప్రదర్శిస్తూ హంగామా సృష్టించారు. అనంతరం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులపై ఆరు పేజీల ఫిర్యాదు లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి అందజేశారు.

ఈ లేఖలో కొండా మురళి, వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలతో తనకు ఉన్న విభేదాలకు గల కారణాలను సవివరంగా వివరించారు. అంతేకాకుండా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా తన లేఖలో ప్రస్తావించి, కొండా సురేఖ పైన పొంగులేటి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నంలోనే ఈ లేఖను అందజేసినట్లు తెలుస్తోంది.

క్రమశిక్షణ కమిటీ స్పష్టమైన ఆదేశాలు

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మాత్రం, కొండా మురళి అడిగిన విషయాలపై వారం రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని, కొత్త విషయాలపై వివరణ తమకు అవసరం లేదని తేల్చి చెప్పింది. కొండా మురళి ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని, ఎటువంటి ఒత్తిడిలకు లొంగే ప్రసక్తే లేదని కమిటీ పేర్కొంది.

ఉత్కంఠ రేపుతున్న కొండా మురళి సమాధానం

క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు కొండా మురళి వారం రోజుల్లో ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులపై తాను చేసిన వ్యాఖ్యలను పదేపదే సమర్థించుకున్న నేపథ్యంలో, తన వ్యాఖ్యలకు ఏ విధంగా సమాధానం చెబుతారు అనేది కీలకం. కొండా మురళి ఇచ్చే సమాధానం పట్ల క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

జిల్లా కాంగ్రెస్ లో పెరుగుతున్న టెన్షన్

కొండా మురళిపై కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లాలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కఠిన చర్యలకు దిగితే కొండా ఫ్యామిలీ ఏం చేయబోతుంది అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌లో మొదలైన ఈ ముసలం ఎక్కడి వరకు వెళుతుందో అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News