కోల్‌ కతా అత్యాచార ఘటన.. సొంతపార్టీ నేతలపై మహిళా ఎంపీ ఫైర్!

కోల్‌ కతాలోని ఓ న్యాయ కళాశాల విద్యార్థిని(24)పై జూన్‌ 25న అత్యాచార ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే!;

Update: 2025-06-29 16:30 GMT

కోల్‌ కతాలోని ఓ న్యాయ కళాశాల విద్యార్థిని(24)పై జూన్‌ 25న అత్యాచార ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే! ఈ ఘటనతో అధికార పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ అత్యాచార ఘటనపై టీఎంసీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా... విద్యార్థినిపై ఆమె స్నేహితులు అత్యాచారం చేస్తే ఎవరేం చేస్తారంటూ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు.

ఇదే సమయంలో.. కాలేజీల్లో పోలీసులు ఉంటారా అని ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యే మదన్ మిత్రా స్పందిస్తూ... ఆ విద్యార్థిని ఒంటరిగా కాలేజీకి వెళ్లకపోతే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో... ఆ వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ విధంగా... బాధితురాలిదే తప్పన్నట్లుగా అధికారిక టీఎంసీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి, బాధిత కుటుంబంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పార్టీలోని నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ సందర్భంగా.. సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... 'ఎక్స్‌'లో ఓ పోస్టు పెట్టారు.

ఈ సందర్భంగా సొంతపార్టీ నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. ఇందులో భాగంగా... భారత్‌ లోని అన్ని పార్టీల్లోనూ స్త్రీ ద్వేషులు ఉన్నారని చెప్పిన మహువా... అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ ఖండిస్తుందంటూ పేర్కొన్నారు. విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు.

ఇదే సమయంలో.. ఘటనపై ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన పోలీసులు.. 12 గంటల్లోపే నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ పైనా ఆమె విమర్శలు చేశారు.

కాగా... కోల్‌ కతాలోని ఓ న్యాయ కళాశాల విద్యార్థినిపై పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్లు కాలేజీ క్యాంపస్ లోనే అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా... విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో రూఢీ అయిందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Tags:    

Similar News