'ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ ని రే*ప్ చేస్తే'... తృణముల్ ఎంపీ షాకింగ్ కామెంట్స్!
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు (31)కు టీఎంసీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది.;
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఓ న్యాయ విద్యార్థిని (24)పై పూర్వ విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు విద్యాసంస్థ ప్రాంగణంలోనే అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ క్రమంలో.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్యపరీక్షల్లో రూఢీ అయిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు!
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు (31)కు టీఎంసీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఈ ప్రభుత్వంలో పశ్చిమ బెంగాల్ మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మండిపడింది. ఈ సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.
అవును... దక్షిణ కలకత్తా లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన అత్యాచారం విషయంలో ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ సమయంలో స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. "ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ పై అత్యాచారం చేస్తే ఏమి చేయాలి. పోలీసులు పాఠశాలల్లో ఉంటారా?" అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో... "ఇది విద్యార్థులు మరొక విద్యార్థిపై చేశారు. బాధితురాలిని ఎవరు రక్షిస్తారు?" అని ప్రశ్న్నించారు. అనంతరం... "ఈ లైంగిక వేధింపులన్నీ ఎవరు చేస్తారు?.. కొంతమంది పురుషులు చేస్తారు. అందువల్ల మహిళలు ఎవరిపై పోరాడాలి?.. మహిళలు ఈ వికృత పురుషులకు వ్యతిరేకంగా పోరాడాలి" అని అన్నారు.
దీంతో... ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వాటిని తీవ్రంగా ఖండించింది. ఇవి జవాబుదారీతనాన్ని పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని తెలిపింది.
టీఎంసీ నష్ట నివారణ చర్యలు!:
ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో తృణమూల్ నాయకులు ఈ పరిణామాలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా... బెంగాల్ మహిళా, శిశు అభివృద్ధి మంత్రి శశి పంజా స్పందిస్తూ.. తాము ఒక మహిళ బాధను రాజకీయం చేయాలనుకోవడం లేదని.. పోలీసులు చర్య తీసుకున్నారని.. నిందితులను వదిలిపెట్టబోమని అన్నారు.
ఇదే సమయంలో... అత్యాచారానికి మరణశిక్ష విధించే ప్రతిపాదన అయిన అపరాజిత బిల్లును జాతీయ స్థాయిలో బీజేపీ అడ్డుకుంటోందని పంజా ఆరోపించారు. మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాన్ని అడ్డుకుంటూ వారి పట్ల గౌరవం గురించి మాట్లాడకండి అంటూ ఆమె బీజేపీ నేతలపై మండిపడ్డారు.