కోల్ కతా లా కాలేజ్ లో గ్యాంగ్ రే*ప్.. కాళ్లు పట్టుకున్నా వదల్లేదు
దేశంలో అతి పురాతన మెట్రో నగరాల్లో ఒకటిగా పేరున్న కోల్ కతా ఇమేజ్ దారుణంగా దెబ్బ తినే పరిణామాలు వరుస పెట్టి సాగుతున్నాయి.;
దేశంలో అతి పురాతన మెట్రో నగరాల్లో ఒకటిగా పేరున్న కోల్ కతా ఇమేజ్ దారుణంగా దెబ్బ తినే పరిణామాలు వరుస పెట్టి సాగుతున్నాయి. దీదీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించటమే కాదు.. ఆమె పార్టీకి చెందిన వారు వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా మారుతోంది. తాజాగా ఆమె పార్టీ సానుభూతిపరులుగా పేర్కొంటున్న వారు..కోల్ కతా లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చేసిన వైనం షాకింగ్ గా మారింది.
కొద్ది కాలం క్రితం ఇదే కోల్ కతా నగరంలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో మెడికోపై హత్యాచారం చోటు చేసుకోవటం.. ఈ ఉదంతం యావత్ దేశాన్ని కదిలించిన వైనం తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా సౌత్ కోల్ కతా లా కాలేజీ విద్యార్థినిపై కాలేజీలోనే ఆ కాలేజీ మాజీ విద్యార్థి.. ఇద్దరు ప్రస్తుత విద్యార్థులు కలిసి గ్యాంగ్ రే*ప్ నకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఉదంతం జరిగిన తీరు చూస్తే.. సినిమా సీన్ మాదిరి ఉండటం గమనార్హం.
లా కాలేజ్ ప్రాంగణంలో చోటు చేసుకున్న ఈ గ్యాంగ్ రే*ప్ ఉదంతం గురించి తెలిస్తే.. పశ్చిమ బెంగాల్ లో వ్యవస్థలు పని చేస్తున్నాయా? నేరస్తులు ఇంతటి బరితెగింపు ఎలా సాధ్యమవుతోందన్న సందేహాలు కలుగకమానవు. ఎగ్జామ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను నింపేందుకు బాధితురాలు విద్యార్థి సంఘం గదిలో కూర్చొని ఫారాలు నింపుతోంది. ఈ సమయంలోనే అధికార టీఎంసీకి చెందిన విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా అక్కడకు వచ్చారు. 31 ఏళ్ల మిశ్రాతో పాటు.. మరో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. టీఎంసీపీ గురించి.. దానికున్న అధికారాల గురించి మాట్లాడి.. కాలేజీ స్టూడెంట్ యూనియన్ విభాగానికి సెక్రటరీగా నియమిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం వరకు ఆమెను అక్కడే ఉండాలని చెప్పారు.
మోనోజిత్ తన రూంలోకి వచ్చి.. తన ఎదుట పెళ్లి ప్రపోజల్ పెట్టారన్న బాధితురాలు.. ‘‘నేను షాక్ తిన్నా. ఇప్పటికే మరొకరితో ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పా. దీనికి అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాలేజీ మొయిన్ గేట్ కు తాళం వేయాలని అక్కడున్న వాళ్లను ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న 19 ఏళ్ల జయిబ్ అహ్మద్.. 20 ఏళ్ల ప్రమీద్ ముఖర్జీతో కలిసి నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. తప్పించుకునే ప్రయత్నం చేయగా అడ్డుకొని చేయి చేసుకున్నారు’’ అంటూ తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఫిర్యాదులో తెలిపారు.
తనను అత్యాచారం చేయొద్దని.. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. తనను వదిలేయాలని వారి కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని పేర్కొన్నారు. తనను అత్యాచారం చేసిన ఉదంతాన్ని జయిబ్.. ప్రమీద్ లు షూట్ చేశారని.. ఆ వీడియోను తన బంధువులు.. స్నేహితులకు పంపుతామని బెదిరించారన్నారు. కాలేజీ సెక్యురిటీ గార్డు కూడా తనను కాపాడలేదన్నారు. బుధవారం రాత్రి ఏడున్నర నుంచి 10-50 గంటల మధ్యలో ఈ దారుణం జరిగినట్లుగా బాధితురాలు వెల్లడించారు.
తనపై జరిగిన గ్యాంగ్ రే*ప్ గురించి బయటకు చెబితే తన బాయ్ ఫ్రెండ్ కు హాని తలపెడతామని.. నా తల్లిదండ్రుల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టినట్లుగా పేర్కొకొన్నారు. క్రూరమైన లైంగిక దాడిలో తనకు శ్వాస కూడా అందలేదని.. తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరినా పట్టించుకోలేదని.. హాకీ స్టిక్ చూపించి కొట్టి చంపుతామని బెదిరించినట్లు చెప్పారు. గ్యాంగ్ రే*ప్ నకు పాల్పడిన మోనోజిత్ మిశ్రా టీఎంసీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్ గా పని చేస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు ఈ ఉదంతంపై టీఎంసీ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్ తో తమ పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ గ్యాంగ్ రే*ప్ పై అధికార టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు తాము ఎలాంటి వారితో తిరుగుతున్నామో చూసుకోవాలని.. రాష్ట్రంలోని ప్రతి చోటా మహిళలకు పోలీసు రక్షణ కల్పించటం సాధ్యం కాదంటూ నోరు పారేసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.