కోకాపేట @ హైస్పీడ్ రైల్వే స్టేషన్
మొత్తం నగరానికి.. కోకాపేటకు మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో కనిపించని వేగంతో డెవలప్ అవుతున్న ప్రాంతాలెన్నో ఉన్నా.. అందులో ముందు వరసలో ఉంటుంది కోకాపేట. హైదరాబాద్ మహా నగరం (జీహెచ్ఎంసీ కాదు క్యూర్) మొత్తంలో అత్యంత ఖరీదైన భవనాలు మాత్రమే కాదు.. భూములకు విపరీతమైన వేగంతో విలువ పెరుగుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది కోకాపేట అవుతుంది. మరో ఐదు నుంచి పదేళ్ల కాలంలో కోకాపేట.. హైదరాబాద్ సిటీకి మరో ఐకాన్ గా మారుతుందన్న మాట రియల్ ఎస్టేట్ వర్గాలు తరచూ చెబుతుంటాయి.
మొత్తం నగరానికి.. కోకాపేటకు మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. అక్కడ వస్తున్న హైరేజ్ భవనాలు మాత్రమే కాదు.. భారీ ఎత్తున వస్తున్న ప్రాజెక్టులతో నగరంలోనే అత్యంత విలాసవంతమైన.. ఖరీదైన ప్రాంతంగా మారటమే కాదు.. హైదరాబాద్ మొత్తంలో మరెక్కడా ఉండని రీతిలో అత్యంత సంపన్న కమ్యునిటీ ఒకటి అక్కడ ఏర్పడుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఎక్కడ ఇల్లు ఉన్నా.. ధనికులు.. సంపన్నులకు కోకాపేటలో ఇల్లు ఉండటం ఒక స్టేటస్ సింబల్ గా మారే వీలుందన్న మాట వినిపిస్తోంది.
ఇలాంటి కోకాపేటకు తాజాగా మరో మణి చేరనుంది. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెబుతున్న హైదరాబాద్ - ముంబయి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు డీపీఆర్ కు ఆమోదం లభించటం ఒక ఎత్తు అయితే.. అందులో భాగంగా కోకాపేటలో హైస్పీడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఇప్పటివరకు కోకాపేటకు దగ్గరగా ఉండే విమానాశ్రయం మాత్రమే కాదు.. అత్యంత దగ్గరగా హైస్పీడ్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చే వీలుంది.
గతంలో హైదరాబాద్ - ఫుణె వరకు మాత్రమే హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రకటించటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - ఫుణె హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు చేపడతామని ప్రకటించటం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో వికారాబాద్, కోకాపేట, శంషాబాద్ లలో హైస్పీడ్ రైల్వే స్టేషన్ల ఏర్పాటు ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. కోకాపేటలో హైస్పీడ్ ట్రైన్ల నిర్వాహణతో పాటు.. కోచ్ షెడ్ కూడా ఏర్పాటు చేస్తారన్న మాట వినిపిస్తోంది.అదే జరిగితే.. కోకాపేట డెవలప్ మెంట్ స్పీడ్ మరో రేంజ్ లోకి వెళుతుందని చెప్పక తప్పదు.