తెగిన ఆ పేగు బంధం మళ్లీ పాలమూరులోకి
కొడంగల్ ను జిల్లాల విభజనలో భాగంగా నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోకి మార్చారు.
ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గానికి ఉంటారు.. మంత్రులు కొన్ని నియోజకవర్గాలకు ఉంటారు.. ముఖ్యమంత్రిని అందించిన నియోజకవర్గం మాత్రం ఒకటే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కుప్పం, పులివెందుల, తెలంగాణ వచ్చాక గజ్వేల్ నుంచి గెలుపొందిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ లు సీఎంలుగా వారివారి నియోజకవర్గాల పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఉమ్మడి పాలమూరులో అదో ప్రత్యేకం
ఉమ్మడి పాలమూరు జిల్లా చాలా పెద్దది. కొత్తూరు నుంచి మొదలై అలంపూర్ వరకు, అచ్చంపేట నుంచి ఆత్మకూరు వరకు విస్తరించిన ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. కాగా, 2016లో తెలంగాణలో మొదలుపెట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ఉమ్మడి మహబూబ్ నగర్ తొలుత నాలుగు, తర్వాత ఐదు జిల్లాలుగా విభజితమైంది. ఈ క్రమంలో తొలుత జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రజల డిమాండ్ మేరకు తర్వాత నారాయణపేటనూ జిల్లాగా చేశారు. కాగా, ఉమ్మడి పాలమూరులో కొడంగల్ నియోజకవర్గానిది ప్రత్యేకత. అటు ఉమ్మడి రంగారెడ్డి, ఇటు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది ఈ నియోజకవర్గం. ఇలాంటిచోట నుంచి 2009, 2014, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. 2018లో ఓటమిపాలైనా.. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణకు సీఎం అయ్యారు.
మళ్లీ పాత జిల్లాలోకి
కొడంగల్ ను జిల్లాల విభజనలో భాగంగా నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోకి మార్చారు. ఇప్పుడు పూర్తిగా పాలమూరు జిల్లాలోకి చేర్చే విషయమై సీఎం రేవంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇతర జిల్లాల పరిధిలోని మండలాలను అన్నిటినీ ఒకే జిల్లాలోకి తేవాలన్న ప్రయత్నమూ చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి పాలమూరులోని షాద్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా రంగారెడ్డి జిల్లాకు మార్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నాగర్ కర్నూల్, మరికొన్నిటిని రంగారెడ్డిలోకి చేర్చారు. దీంతో నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు మండలాలు మరోవైపు అయ్యాయి. ఇప్పుడు వీటిని సరిచేసే ప్రయత్నం సాగిస్తున్నారు. సీఎం నియోజకవర్గం, సొంత జిల్లా కాబట్టి అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నియోజకవర్గం స్వరూపాన్ని జిల్లాల పరిధి నుంచి మార్చే కసరత్తు చేస్తున్నారు.
కొసమెరుపు: కేసీఆర్ సీఎంగా ఉండగా 2చేసిన జిల్లాల పునర్విభజనలో రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ను రెండుగా చేశారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ సీఎం అయి.. తన నియోజకవర్గాన్ని ఒకచోటకు తెచ్చే పనిలో ఉన్నారు.