కేసీఆర్ పాలనలో స్వేచ్ఛ లేదు.. ఫోన్ చూస్తేనే భయం.. చిట్ చాట్ లో కోదండరాం సంచలన వ్యాఖ్యలు!
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.;
మలి దశ తెలంగాణ ఉద్యమ గొంతుకగా పేరున్న ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు స్వయంగా ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాక, గత పాలనపై చేస్తున్న ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇంట్లో ఫోన్ పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి’ ఉండేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వ హయాంలో ఉన్న భయాన్ని ఎత్తిచూపుతోంది.
తెలంగాణ శాసనమండలి సభ్యునిగా (ఎమ్మెల్సీ) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం రాజకీయంగా చురుగ్గా మారుతున్నారు. నిన్న జరిగిన ఒక చిట్ చాట్‌లో ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్) స్థాపనలో కీలక పాత్ర పోషించిన కోదండరాం, ఇప్పుడు అదే పార్టీ ‘ప్రజలకు దూరమై మనుగడ కోల్పోతోంది’ అని విశ్లేషించడం గమనార్హం.
నిఘా నీడలో భయం భయం!
హరీశ్ రావు ప్రస్తుతం 'హ్యాకింగ్' ఆరోపణలు చేస్తుంటే, కోదండరాం గత పదేళ్లలో ప్రజలు, నాయకులు అనుభవించిన 'ట్యాపింగ్' భయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలు తమ వ్యక్తిగత విషయాలను ఫోన్లలో మాట్లాడుకోవడానికి భయపడేవారని, చాలా మంది ఫోన్లను ఇంట్లోనే వదిలి బయట కలుసుకునే వారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో భయం లేదని ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
కుటుంబ రాజకీయాలు
ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై కోదండరాం తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత విభేదాలు లేదంటే విధానపరమైన లోపాలను కవితే స్వయంగా బయటపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు దూరంగా ఉండి, కేవలం కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చే ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం నిలబడలేదని, బీఆర్ఎస్ ప్రస్తుతం అటువంటి సంక్షోభంలోనే ఉందని విశ్లేషించారు.
మంత్రి పదవిపై క్లారిటీ..
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘నేను ఎప్పుడూ మంత్రి పదవి కావాలని కాంగ్రెస్ పార్టీని కోరలేదు. అలాగే ప్రభుత్వం కూడా నాకు ఇస్తానని ముందే చెప్పలేదు. అని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యమ నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడ్డ తనకు, ఇప్పుడు సభలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించే అవకాశం దక్కిందన్నారు.
ఒకప్పుడు కేసీఆర్ సర్కార్‌ను గడగడలాడించిన కోదండరాం, ఇప్పుడు అదే అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా గత పాలకుల తప్పులను ఎండగడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం కలిగిస్తున్నా, సామాన్య ప్రజల్లో ‘మార్పు’ను గుర్తు చేస్తున్నాయి. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించడం ద్వారా ప్రభుత్వం తన పట్టు పెంచుకోవాలని చూస్తోంది.