ధనవంతుల కోసం ప్రత్యేకంగా డేటింగ్ యాప్

భారతదేశంలో డేటింగ్ యాప్‌ల పరిణామం విభిన్న మలుపులు తీసుకుంటోంది. కొన్నేళ్లుగా ప్రేమ, సంబంధాల కోసం యువత ఈ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు.;

Update: 2025-07-26 05:09 GMT

భారతదేశంలో డేటింగ్ యాప్‌ల పరిణామం విభిన్న మలుపులు తీసుకుంటోంది. కొన్నేళ్లుగా ప్రేమ, సంబంధాల కోసం యువత ఈ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని యాప్‌లు వినూత్న, కొన్నిసార్లు వివాదాస్పదమైన, ప్రమాణాలతో సమాజంలో ఒక ప్రత్యేక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తాజాగా "Knot.dating" అనే కొత్త డేటింగ్ యాప్ అటువంటి వివాదాస్పద ప్రయోగంతో వార్తల్లో నిలిచింది.

ఆడవాళ్లకు స్వేచ్ఛ.. మగవాళ్లకు ఆదాయ పరిమితి!

ఈ యాప్‌లో సభ్యులుగా చేరడానికి ఒక కీలకమైన షరతు ఉంది. పురుషులు ఏటా కనీసం ₹50 లక్షలు ఆదాయం సంపాదించి ఉండాలి. అయితే, మహిళలకు ఎలాంటి ఆదాయ పరిమితి ఉండదని సంస్థ స్పష్టం చేసింది. ఈ విధానం మహిళలకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమని యాప్ వ్యవస్థాపకులు పేర్కొన్నారు. అంతేకాదు, ప్రతి సభ్యుని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయబడుతుంది. అదనంగా వారికి ఒక వ్యక్తిగత సంబంధాల మేనేజర్‌ను కూడా కేటాయిస్తారు.

ఏఐ (AI)తో సంబంధాల ఏర్పాటా..?

ఈ యాప్‌ను అభిషేక్ అస్తానా, జస్‌వీర్ సింగ్ కలిసి ప్రారంభించారు. 'క్లాసిక్ మ్యాట్రిమోనియల్ సైట్‌ల'లా కాకుండా ఫిల్టర్లతో ఆడుకోకుండా... Knot.dating వినియోగదారులు చిన్న చాటింగ్ ద్వారా తమ వ్యక్తిత్వం, భావోద్వేగాలను, సంభాషణ శైలిని యాప్‌లో వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఆ డేటాను ఆధారంగా తీసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానంతో మెచ్చే భాగస్వామిని సూచిస్తారు.అయితే, ఎమోషనల్ కనెక్ట్, నిజమైన సంబంధం వృద్ధి చెందడం అనేది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సాధ్యం కాదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర నమ్మకం, బంధం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది.

వివాదాస్పదమైన అంశాలు

ఈ యాప్ ఆదాయాన్ని ప్రధాన అర్హతగా పెట్టిన తీరుపై పెద్ద చర్చ జరుగుతోంది. స్నేహం, ప్రేమ అనేవి డబ్బు ఆధారంగా నిర్ణయించలేని భావోద్వేగాలు. ఇలా ఆదాయాన్ని ప్రమాణంగా పెట్టడం వల్ల సమాజంలో అసమానతలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. అలాగే, 100% నేపథ్య పరిశీలన అనేది వ్యక్తిగత గోప్యతపై ప్రభావం చూపే అంశం. వ్యక్తిగత డేటా డిజిటల్‌గా నిల్వ ఉండటం వల్ల హ్యాకింగ్ ప్రమాదం కూడా ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.

డేటింగ్ యాప్‌లు ప్రేమ కోసం ప్రారంభమైనా, ఇప్పుడు వాటిలో ఫిల్టర్‌లు, ప్రమాణాలు, డేటా విశ్లేషణలతో నిండి ఉన్నాయి. Knot.dating లాంటి యాప్‌లు "ధనికత" అనే ప్రమాణాన్ని పెట్టి "ప్రేమ" అనే భావనను ఒక వర్గానికే పరిమితం చేయడమే కాకుండా, డేటా భద్రత, వ్యక్తిగత గోప్యతలపై కూడా ప్రశ్నలు కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ తరహా యాప్‌లు నిజమైన సంబంధాలను ఏర్పరచగలవా? లేదా, మనుషుల మధ్య సంబంధాలను ఒక వ్యాపారంగా మార్చే దిశగా వెళ్తాయా? అన్నది సమాజం ఎదుర్కొనాల్సిన ప్రధాన ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News