నెట్టింట పింక్ ట్యాక్స్ రచ్చ... మహిళా లోకం సీరియస్!
సాధారణంగా ఇన్ కం ట్యాక్స్, జీఎస్టీ వంటి పన్నుల గురించి తెలిసే ఉంటుంది కానీ.. వాటిలా అధికారిక పన్ను కాకుండా అనధికారిక పన్ను ఒకటి ఉందని;
సాధారణంగా ఇన్ కం ట్యాక్స్, జీఎస్టీ వంటి పన్నుల గురించి తెలిసే ఉంటుంది కానీ.. వాటిలా అధికారిక పన్ను కాకుండా అనధికారిక పన్ను ఒకటి ఉందని.. దీనిపై ఐక్యరాజ్య సమితి సైతం స్పందించిందని.. ఇది పూర్తిగా లింగ వివక్షతకు అద్దం పడుతుందని.. ఆర్థిక సమానత్వం అంశాన్ని తెరపైకి తెస్తుందని తెలుసా? పూర్తిస్థాయిలో ప్రచారంలోకి వచ్చినట్లు అనిపించకపోయినా ఇది సీరియస్ మ్యాటరే! మహిళా లోకానికి మరింత సీరియస్ మ్యాటర్!!
అవును... ప్రస్తుతం పింక్ టాక్స్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతుంది. వీలైనంత క్లియర్ గా ఈ ట్యాక్స్ ఎలా వేస్తున్నారో చెబుతూ.. ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తూ నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోపై పలువురు మహిళా ప్రముఖులు స్పందిస్తున్నారు. మహిళలకూ, పురుషులకూ వస్తువుల విషయంలో కూడా తేడా ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వస్తువులు కొనద్దని సూచిస్తున్నారు.
పింక్ టాక్స్ అంటే ఏమిటి?:
పింక్ టాక్స్ అనేది ఎటువంటి డైరెక్ట్ ట్యాక్స్ కాదు.. ఇండైరెక్ట్ ట్యాక్స్ కాదు. వేల్యూ యాడేడ్ ట్యాక్స్ గా కూడా ఏమాత్రం పరగణించరు. సాధారణంగా జెండర్ బేస్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ గా దీన్ని అభివర్ణిస్తారు. అంటే... జెండర్ ఆధారంగా వారు కొంటున్న వస్తువుల ధరల్లో వ్యత్యాసాలు (వివక్ష) ఉంటాయన్నమాట! ఈ విషయంలో... మహిళలు కొనుగోలు చేసే వస్తువుల కోసం ఎక్కువ డబ్బు చెల్లించాలన్నమాట.
ఉదాహరణకు... పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, క్రీములు, లోషన్లు, డియోడ్రెంట్ వంటి ప్రోడక్ట్స్ విషయంలో ధరల్లో వ్యత్యాసాలు ఉండటం అన్నమాట. ఉదాహరణకు మగవాళ్లు వాడే ఫేస్ క్రీం ధర 80 రూపాయలు ఉంటే.. అదే కంపెనీకి చెందిన మహిళలు వాడే క్రీం ధర సుమారు 40 - 50 రెట్లు అధిక ధరకు అమ్ముడవ్వడం.
ఇదే సమయంలో వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం (డబ్ల్యూ.ఈ.ఎఫ్.) లెక్కల ప్రకారం... వివక్షతో కూడిన ఈ ధరల వల్ల మహిళలపై అధిక భారం పడుతోందని తెలిపింది. పైగా సంపాదన విషయంలో పురుషుల కంటే మహిళల సంపాదన తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ పింక్ ట్యాక్స్ ఉన్న వస్తువులకు కొనుగోలు చేయడం వల్ల మహిళలపై అదనపు భారం పడుతుందని వెల్లడించింది.
స్పందించిన కిరణ్ మంజుందార్ షా!:
ఈ పింక్ ట్యాక్స్ వ్యవహారంపై తాజాగా బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా స్పందించారు. ఇందులో భాగంగా... పురుషులు వినియోగించే వస్తువుల ధరలకంటే.. మహిళలు ఉపయోగించే ప్రోడక్ట్స్ ధరలు ఎందుకు ఎక్కువని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు! ఆ తరహా వస్తువులను కొనుగోలు చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.