ఆ ఊరిలో ఎవరూ అబద్ధాలు చెప్పరు.. దొంగతనాలు చేయరు!

ఈ ఆధునిక ప్రపంచంలో నీతి, నిజాయితీ, నమ్మకం అనే పదాలు కేవలం డిక్షనరీలకే పరిమితమయ్యాయి. కానీ, నమ్మశక్యం కాని విధంగా మన భారతదేశంలోనే ఓ అద్భుతమైన గ్రామం ఉంది.;

Update: 2025-05-31 18:30 GMT

ఈ ఆధునిక ప్రపంచంలో నీతి, నిజాయితీ, నమ్మకం అనే పదాలు కేవలం డిక్షనరీలకే పరిమితమయ్యాయి. కానీ, నమ్మశక్యం కాని విధంగా మన భారతదేశంలోనే ఓ అద్భుతమైన గ్రామం ఉంది. అక్కడి ప్రజలు నిజాయితీనే తమ జీవన విధానంగా పాటిస్తారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు పశ్చిమాన 20 కిలోమీటర్ల దూరంలో భారత్-మయన్మార్ సరిహద్దులో ఉన్న ఆ గ్రామమే "ఖోనోమా". ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఆ ఊరిలో ఎవరూ అబద్ధాలు చెప్పరు, దొంగతనాలు చేయరు, ఇళ్లకు తాళాలు వేయరు, దుకాణాలను కూడా నడపరు.

ఈ విలక్షణమైన గ్రామానికి మొత్తం 154 ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని వారు "కెన్యు" రూల్స్ అని పిలుస్తారు. ఒకవేళ ఎవరైనా కెన్యు రూల్స్ పాటించకపోతే దేవుడు వారి పనిపడతాడని గ్రామస్తులు బలంగా నమ్ముతారు. అందుకే ఖోనోమా గ్రామం దేశంలోనే "అత్యంత నిజాయితీ గల గ్రామంగా" ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోని ప్రజలందరూ అంగమి తెగకు చెందినవారు. ఇది నాగాలాండ్‌లోని ఒక ముఖ్యమైన గిరిజన సమూహం, వీరిని అంగమి నాగా అని పిలుస్తారు.

అంగమి తెగ సంప్రదాయాలు

గోల్హో వీరి ప్రధాన ఆహారం. గోల్హో అనేది అన్నం, హిమాలయన్ చిమాటి కూర మిశ్రమం. వీరు కూరగాయలు, పంది మాంసం, గొడ్డు మాంసం కూడా తింటారు. వీరిలో దాదాపు అందరూ క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఖోనోమా జనాభా సుమారు 2,000. ఇక్కడ పురుషుల కంటే స్త్రీల జనాభా పది రెట్లు ఎక్కువగా ఉంది. ఈ గ్రామం ప్రకృతి ఒడిలో పచ్చదనంతో, మంచుతో కప్పబడి, ప్రకృతి తనకోసం ఒక ఇల్లు నిర్మించుకున్నట్లు ఉంటుంది.

మోసానికి తావు లేదు

నాగాలాండ్‌లోని చాలా గ్రామాలు ఖోనోమా వాతావరణాన్ని కలిగి ఉన్నప్పటికీ, "కెన్యు" రూల్స్ ప్రకారం జీవించడం వల్లనే ఖోనోమా దేశంలో ఒక నిజాయితీ గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఖోనోమాను "యోధుల గ్రామం" గా కూడా పిలుస్తారు. వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీరోచిత పోరాట చరిత్రను కలిగి ఉన్నారు. ఖోనోమా ప్రజల మధ్య నిజాయితీ కేవలం ఒక నైతిక గుణం మాత్రమే కాదు, అది వారి సామాజిక, సాంప్రదాయ శక్తి కూడా. నిజాయితీ పట్ల వారి నిబద్ధత తెగలో ధనిక, పేదల మధ్య అసమానతలను తొలగించింది. ఆ గ్రామంలో దొంగతనం అనే మాటే లేదు.

దైవభక్తితో కూడిన నిజాయితీ

దొంగతనం అనేది దేవునికి వ్యతిరేకంగా మనిషి చేసే పాపమని ఖోనోమా ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఖోనోమాలోని దుకాణాలలో వినియోగదారులు తమకు కావలసిన వస్తువులను తీసుకుని, డబ్బును అక్కడే వదిలివేస్తారు. డబ్బు సేకరించడానికి, లెక్కించడానికి ఎవరూ ఉండరు. ఖోనోమా గ్రామంలో ఈ నమ్మకం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అంతేకాదు, ఒక రైతు పండిన పంటను ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అలసిపోతే, దానిని రోడ్డు పక్కన వదిలేసి మరుసటి రోజు వచ్చి తీసుకుంటాడు. అప్పటివరకు పంట రోడ్డు పక్కనే సురక్షితంగా ఉంటుంది. ఎవరైనా తీసుకెళ్తారనే భయం ఉండదు.

నిజాయితీ వారి మత విశ్వాసాలలో భాగం. 19వ శతాబ్దంలో ఇక్కడ క్రైస్తవ మతం విస్తరించడానికి ముందు కూడా ఖోనోమాలోని ఈ అంగమి ప్రజలు 'ఆనిమిజం' (Animism) అన్న భావనను నమ్మేవారు. ఈ నమ్మకం నేటికీ కొనసాగుతోంది. ఆనిమిజం అంటే సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, ప్రదేశానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సారం ఉంటుందని నమ్మకం. ఈ నమ్మకం కేవలం మతపరమైనది కాదు. ఆనిమిజం ఆచారాలు, సంప్రదాయాలు, పర్యావరణానికి అనుకూలమైన జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో అంగమి పూర్వీకులు స్థాపించిన 154 నియమాలు కెన్యు (Khenyu)గా పిలుస్తారు.

పిల్లి మాంసాన్ని దొంగిలించి తినడం కూడా కెన్యు. ఖోనోమా ప్రజలు ఇలా చేస్తే పిల్లి శాపం తగులుతుందని నమ్ముతారు. ఇది దత్తత తీసుకున్న పిల్లలను తినడానికి చంపడం వంటి సంఘటనల నుండి పుట్టింది. లంచం తీసుకోవడం, తమ కోసం పనిచేసిన వారికి సగం జీతం ఇవ్వడం, అత్తగారిని అవమానించడం, గుమ్మడికాయపై వేలు పెట్టడం ఇవన్నీ కెన్యు. ఖోనోమా ప్రజలు ఈ ప్రతి రకమైన తప్పుకు వేర్వేరు ప్రతికూల పరిణామాలు ఉంటాయని నమ్ముతారు. మీరు గుమ్మడికాయపై వేలు పెడితే అది కుళ్ళిపోతుందని, అత్తగారిని అవమానిస్తే పక్షవాతం వస్తుందని, తమ కోసం పనిచేసిన వారికి సగం జీతం ఇస్తే, దేవుడు తమకు నిర్ణయించిన ఆశీర్వాదం వారికి లభిస్తుందని ఖోనోమా గ్రామంలోని అంగమి ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకే నిజాయితీ,సత్యం వారిలో లోతుగా పాతుకుపోయాయి.

2005లో, భారత ప్రభుత్వం ఖోనోమాను "దేశంలో మొట్టమొదటి హరిత గ్రామం"గా ప్రకటించింది. గ్రామంలో "ఖువునో" అనే చిన్న మొక్క పుష్కలంగా పెరగడం వల్ల గ్రామానికి ఖోనోమా అనే పేరు వచ్చింది.

Tags:    

Similar News