రేవంత్ తెలివైన నిర్ణయం.. కోదండరామ్ కు కీలక బాధ్యతలు
కీలక పోలింగ్ ముగిసి.. ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ కే అధికారం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. రేవంత్ మీడియాతో మాట్లాడారు.;
అధికారం చేతికి వచ్చే అవకాశాలు మొండుగా ఉన్నప్పుడు నోటి మాటలో మార్పు వస్తుంది. విపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు భిన్నంగా ఉండటం సహజం. అందుకు భిన్నంగా రేవంత్ నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. వ్యూహాత్మకంగా ఉన్నట్లుగా చెప్పాలి. కీలక పోలింగ్ ముగిసి.. ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ కే అధికారం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. రేవంత్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఆయన మాటల్లో బలంగా వినిపించింది. అంతేకాదు.. ఎగ్జిట్ పోల్స్ తప్పు అంటూ కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలకు కౌంటర్ అదే స్థాయిలో ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. రానున్న రోజుల్లో తాము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని రేవంత్ చెప్పేశారు. అందులో భాగంగా అమరవీరుల కుటుంబాల సంక్షేమ బాధ్యతను ప్రొఫెసర్ కోదండరామ్ కు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరుల కుటుంబాల సంక్షేమంపై కేసీఆర్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ వేళ.. ఉద్యమంలో కీలకభూమిక పోషించి.. అనంతరం పదవులకు దూరంగా ఉన్న కోదండరామ్ కు బాధ్యతలు అప్పటించటం తెలివైన నిర్ణయంగా చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా కోట్లాడి వారికి కేసీఆర్ సర్కారులో పదవులు రాలేదన్న ఆరోపణ ఉంది. అందుకు కోదండరామ్ ను దూరంగా పెట్టటాన్ని పలువురు చూపిస్తుంటారు. ఎన్నికల ఫలితాలు రాకుండానే.. అధికారం వచ్చే అవకాశం ఉందన్న వేళలో.. ప్రత్యేకంగా కోదండరామ్ ప్రస్తావనను రేవంత్ తీసుకురావటాన్ని చూసినప్పుడు ఆయన మాటలు వ్యూహాత్మకంగానే కాదు.. ఉద్యమంలో పని చేసిన ఉద్యమకారుల్ని సంతోషపెట్టేలా మారిందన్న మాట వినిపిస్తోంది.