టెన్షన్ టెన్షన్: తాడిపత్రికి పెద్దారెడ్డి.. బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి!
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.. ఘర్షణ వాతావరణం నెలకొంది.;
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.. ఘర్షణ వాతావరణం నెలకొంది. సుమారు ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించారు. ఇలా కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని తెలుస్తోంది. ఈ విషయం జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలిసింది!
అవును... అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు ఉదయం తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. పెద్దారెడ్డి ఇంటివైపు బయలుదేరారు. తాడిపత్రికి రావొద్దంటూ ఆయన్ను అడ్డుకునేందుకు యత్నించారు.
మరోవైపు పరిసర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆయన్ను వాహనంలో ఎక్కించుకొని అనంతపురం తీసుకెళ్లారు.
వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది.. కానీ, న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో ఇటీవలే అధికారులపై ఆయన కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు! మరోవైపు తాడిపత్రికి పెద్దారెడ్డి రాకను జేసీ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం కూడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కాగా... పెద్దారెడ్డి ఇంటికి సరైన అనుమతులు లేవని, దాన్ని కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారనే సమాచారంతో ఆయన తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారని అంటున్నారు!