వైసీపీలోకి కేశినేని.. కండీషన్స్‌ అప్లై!

ఈ నేపథ్యంలో కేశినేని నానికి విజయవాడ ఎంపీ సీటును ఆఫర్‌ చేసిట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేశినేని నాని ఇందుకు కొన్ని షరతులు పెట్టినట్టు చెబుతున్నారు.

Update: 2024-01-10 08:06 GMT

టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నేని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌ సభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని కేశినేని నాని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని నాని ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)పై కేశినేని గెలుపొందారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో పీవీపీపై కేశినేని నాని 8,726 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.

కాగా వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని నానికి సీటు ఇవ్వబోమని టీడీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీ స్థానంలో కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని (శివనాథ్‌) పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ తరఫున వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు. ఇటీవల తిరువూరులో జరిగిన చంద్రబాబు సభ ఏర్పాట్లను సైతం కేశినేని చిన్నినే చూసుకున్నారు.

ఈ నేపథ్యంలో తన ఎంపీ పదవికి, టీడీపీకి కేశినేని నాని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఆయన కుమార్తె, విజయవాడ టీడీపీ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత సైతం తన పదవికి రాజీనామా చేశారు.

Read more!

ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ స్థానాన్ని ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయిన వైసీపీ కేశినేని నానిపై దృష్టి సారించిందని చెబుతున్నారు. 2014లో వైసీపీ తరఫున విజయవాడలో కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) వైసీపీ తరఫున బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా విజయవాడ ఎంపీ సీటును తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది.

ఈ నేపథ్యంలో కేశినేని నానికి విజయవాడ ఎంపీ సీటును ఆఫర్‌ చేసిట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేశినేని నాని ఇందుకు కొన్ని షరతులు పెట్టినట్టు చెబుతున్నారు. తనతోపాటు అసెంబ్లీ అభ్యర్థులుగా తాను చెప్పినవారికి సీట్లు ఇవ్వాలని ఆయన కోరారని అంటున్నారు. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నుంచి తన కుమార్తె కేశినేని శ్వేతకు, విజయవాడ పశ్చిమ నుంచి ఎంకే బేగ్‌ కు, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నంకు, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసుకు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు సీట్లు ఇస్తేనే తాను వైసీపీలో చేరతానని నాని చెప్పారని టాక్‌.

అయితే వైసీపీ నాని కోరినన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెబుతున్నారు. నానితోపాటు మరో ఇద్దరికి అయితే సీట్లు ఇవ్వగలమని.. ఐదుగురిగి సీట్లు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారని.. వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News