టికెట్ అందుకుని మరీ చేరుతున్న కేశినేని...!
కేశినేని నాని స్పెషల్ అని చెప్పాలి. ఆయన వైసీపీలో చేరకుండానే టికెట్ అందుకున్నారు
కేశినేని నాని స్పెషల్ అని చెప్పాలి. ఆయన వైసీపీలో చేరకుండానే టికెట్ అందుకున్నారు. విజయవాడ పార్లమెంట్ కి వైసీపీ ఇంచార్జిగా కేశినేని నాని నియమితులయ్యారు. మూడవ జాబితాలో ఆయన పేరు ఉంది. నిజానికి చూస్తే కేశినేని నాని జగన్ ని ముందు రోజు కలిశారు. పార్టీలో చేరేందుకు తన సుముఖత వ్యక్తం చేశారు. అంతే ఇరవై నాలుగు గంటలు గడవకముందే ఆయన విజయవాడ వైసీపీ ఎంపీ క్యాండిడేట్ అయ్యారు.
దీంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత కేశినేని నాని వైసీపీ జగన్ తో భేటీ అయ్యేందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి వచ్చారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు.
ఈ భేటీ తరువాత కేశినేని నాని వైసీపీలో చేరిపోవడం లాంచనమే అవుతుంది. అందుకే ఆయన కుమార్తె కేశినేని శ్వేతను సైతం వెంటబెట్టుకుని వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కేశినేని నాని వైసీపీలో చేరడం ఆయన రాజకీయం బెజవాడలో హీటెక్కించేస్తున్నాయి. ఆయన జగన్ ని కలవడంతోనే రాజకీయ ప్రకంపనలు పుట్టాయి.
ఇక ఆయన బెజవాడ ఎంపీగా పోటీలో ఉంటే అది వైసీపీకి అసెంబ్లీ సీట్లలోనూ బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కేశినేని నాని కుమార్తె శ్వేతకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకశం ఉందా అన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా బెజవాడ నుంచే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయని అంటున్నారు.