మీతో కలిసి పనిచేసిన కాలం మరచిపోలేనిది.. కేశినేని నాని ఎమోషనల్ పోస్ట్

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఫేస్ బుక్ పోస్టు వైరల్ అవుతోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నాని.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.;

Update: 2025-04-20 08:40 GMT

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఫేస్ బుక్ పోస్టు వైరల్ అవుతోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నాని.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆసక్తిగా ఉన్నారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు పురస్కరించుకుని తన ఫేస్ బుక్ అకౌంటు ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీలో రీ ఎంట్రీకి ఆయన ఆసక్తిగా ఉన్నారనే ప్రచారానికి ఈ పోస్టు మరింత ఊతమిస్తోందని అంటున్నారు.

టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన నాని టీడీపీ అధినేత చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉండేవారు. 2023లో చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా బాబు పక్కనే ఉంటూ ఆయన మనోధైర్యం చెప్పారు నాని. ఇక చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఆయన పక్కనే ఉండేవారు నాని. అయితే ఆయన స్థానంలో నాని సోదరుడు చిన్నిని పార్టీ ప్రోత్సహిస్తోందని కినుక వహించి గత ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తమ్ముడు చేతిలోనే ఓడిపోయారు.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న అనుబంధం కారణంగా నాని వైసీపీలోకి వెళ్లినా.. ఇప్పటికీ టీడీపీ నాయకులతోనే రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో తన కుమార్తె శ్వేత రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ సొంతగూటికి రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తెకు అవకాశం ఇచ్చారు. అయితే తండ్రితోపాటు శ్వేత కూడా గత ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆమె కూడా టీడీపీలోకి తిరిగిరావాలని చూస్తున్నారని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పుట్టిన రోజు పురస్కరించుకుని మాజీ ఎంపీ నాని ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబు ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవకు సూచిస్తుందని నాని తెలిపారు. ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగం అయ్యే అవకాశం తనకు లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో సేవలో మరిన్ని ఏళ్లు చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నట్లు నాని తన పోస్టులో రాశారు.

నాని ఫేస్ బుక్ పోస్టుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల ముందు తొందర పాటుతో చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కాగా, కేశినేని నాని టీడీపీలో రీ ఎంట్రీకి ఆయన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడ్డుపుల్ల వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News