అన్నాదమ్ముల పంచాయితీ.. ‘ఈడీ’కి చేరి ముదిరి పాకానపడింది
విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వైరం రోజురోజుకీ ముదురుతోంది.;
విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వైరం రోజురోజుకీ ముదురుతోంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ వ్యవహారాల్లో చిన్ని ప్రమేయం ఉందని ఆరోపిస్తూ నాని ఈడీకి ఫిర్యాదు చేశారు.
చిన్ని అవినీతిపరుడని మొదటి నుంచి ఆరోపిస్తున్న నాని, ఇటీవల మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో చిన్నికి వ్యాపార సంబంధాలున్నాయని, వీరిద్దరూ కలిసి ఆర్థిక లావాదేవీలు నడిపారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా నాని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన నాని, తాజాగా ఈడీకి ఫిర్యాదు చేసి చిన్నిపై విచారణ కోరారు. ఈడీకి చేసిన ఫిర్యాదును ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈడీకి నాని ఫిర్యాదులో కీలక అంశాలు:
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నం. 21/2024 కింద జరుగుతున్న విచారణకు సంబంధించి కీలక వాస్తవాలను ఈడీ దృష్టికి తీసుకెళ్తున్నానని నాని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)పై తనకు నమ్మకం లేదని కేశినేని చిన్ని సీబీఐ విచారణకు అభ్యర్థించడం ఆందోళనకరమని నాని తెలిపారు. అధికారిక రికార్డులు, పబ్లిక్ డొమైన్ సమాచారం ప్రకారం, కేశినేని శివనాథ్ (చిన్ని), అతని భార్య జానకి లక్ష్మి, రాజ్ కసిరెడ్డి ప్రైడ్ ఇన్‌ఫ్రాకామ్ LLPతో పాటు ఇతర వ్యాపార సంస్థలలో భాగస్వాములుగా ఉన్నారని, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002ను ఉల్లంఘించి ఈ సంస్థలను ఆదాయ లావాదేవీలకు ఉపయోగించి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములతో సహా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వివిధ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిపి వుంటారని నమ్మడానికి బలమైన ఆధారాలున్నాయని నాని ఈడీకి తెలిపారు.
ఈ వ్యవహారంలో కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకటచౌదరి, మధు బాబు కందిమళ్ల, సురేష్ పీటీ, రామ్ వెనిగళ్ల, చక్రవర్తి కడియాల, వంశీ కడియాల, కుమార్ అడుసుమల్లి, రాజేష్ పోసం, మోహన్‌రావు బొల్లినేని, వెంకటకృష్ణ కిషోర్ తాళ్లూరి, నాగేశ్వరరావు గాలిపై విచారణ జరపాలని ఆయన ఈడీని అభ్యర్థించారు. రూ. 2,000 కోట్ల చైన్-లింక్ స్కామ్‌పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైందని, ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉందని నాని ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. లోతైన, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి నిజానిజాలను వెలికి తీయాలని నాని తన ఫిర్యాదులో ఈడీని కోరారు. ఈ ఫిర్యాదుపై ఈడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో, నాని ఫిర్యాదు ఈ కేసు విచారణలో కీలక పరిణామం కానుంది. మరోవైపు, నాని ఆరోపణలపై కేశినేని చిన్ని స్పందిస్తూ, మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, నాని ఆరోపణలపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఈ పరిణామాలు విజయవాడ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి.