రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న కీలక నేత!

మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వనున్నారని రాజధాని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-05-21 06:17 GMT

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని మనసు మార్చుకున్నారా? రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఏడాది క్రితం ప్రకటించిన ఆయన మళ్లీ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారా? తన రాజకీయ పునరాగమనంపై ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నప్పటికీ తాజాగా ఆయన బీజేపీ నేతలతో చర్చించారని ప్రచారంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయ సన్యాసం తీసుకున్నా, తన తమ్ముడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని టార్గెట్ గా కొన్నిరోజులుగా నాని చేస్తున్న విమర్శలు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు.

మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వనున్నారని రాజధాని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు నాని ప్రకటించారు. విజయవాడలోని తన కార్యాలయం కేశినేని భవన్ కి ఉన్న వైసీపీ బ్యానర్లు తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనట్లే ఉన్నప్పటికీ, కొద్దిరోజులుగా ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న ప్రకటనలతో నానికి మళ్లీ రాజకీయాలపై మనసు మళ్లిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో నానికి రాజకీయ, ఆర్థిక, కుటుంబ పరమైన విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా చిన్ని టార్గెట్ గా నాని తన సోషల్ మీడియా ఖాతాల్లో సంచలన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనకు రాజకీయంగా యాక్టివ్ ఉండాలనే ఆలోచన ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో లేని వ్యక్తికి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నవారిని టార్గెట్ చేయాల్సిన అవసరమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఏదో సామాజిక కోణంలో ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని భావించినా, కేవలం ఎంపీ చిన్నిని టార్గెట్ చేయడం, అందునా ఆయన నానికి రాజకీయ ప్రత్యర్థి కావడంతో మాజీ ఎంపీ రాజకీయ ఆసక్తిపై ఊహాగానాలకు తావిస్తోందని అంటున్నారు.

రెండు సార్లు విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని.. గత ఎన్నికల ముందు పార్టీ వైఖరిపై కినుక వహించి వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా మూడో సారి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేశారు. అయితే కూటమి హవాతో సొంత తమ్ముడి చేతిలోనే ఓటమి చెందారు. రెండు సార్లు ఎంపీగా చేసిన తాను ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వైసీపీలో ఇమడలేకపోవడం, టీడీపీలో పునరాగమనానికి చాన్స్ లేకపోవడంతో బీజేపీ పెద్దలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన ఆర్థిక పరిస్థితుల వల్ల బీజేపీలో చేరడం మంచిదనే ఆలోచనతో ఆయన ఉన్నారని అంటున్నారు.

కొన్నిరోజులుగా విజయవాడ ఎంపీ చిన్నిపై యుద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ నానిని సోదరుడు టార్గెట్ చేశారని అంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపిస్తూ సీబీఐకి ఫిర్యాదులు పంపుతున్నారు. ఈ కారణంగా తాను రాజకీయాలతో సంబంధం లేనట్లు ఉంటే ప్రమాదమనే ఆలోచనకు వచ్చిన మాజీ ఎంపీ నాని.. రాజకీయ అండదండలు అందించాల్సిందిగా బీజేపీ పెద్దలను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ ఎంపీ స్థాయి వ్యక్తి పార్టీలో చేరతామని కోరుతుండటం, రాష్ట్రంలో బలం పుంజుకోవాలనే ఆలోచనతో కమలనాథులు కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. చర్చలు కొలిక్కి వచ్చాయని తగిన సమయంలో నాని బీజేపీలో చేరిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల తొలివారంలో నాని కమలం కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చేనెలలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారని, ఆ సమయంలోనే నాని పునరాగమనంపై నిర్ణయం ఉంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Tags:    

Similar News